గౌరుకు ‘నో’ చెప్పిన జగన్

వైసీపీ అధినేత జగన్ కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయించుకున్నారు. అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఉన్న జగన్ ను వైసీపీ నేత గౌరువెంకటరెడ్డి కలిశారు. తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తనకు ఎంతమంది మద్దతు ఉందో కూడా ఆయన లెక్కలతో జగన్ కు వివరించారు. గత ఎన్నికల్లోనే 62 ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామని, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని జగన్ కు వివరించే ప్రయత్నం చేశారు గౌరు వెంకటరెడ్డి. అయితే జగన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదని తెలుస్తోంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి పోటీ చేస్తామని అనడం కరెక్ట్ కాదని జగన్ గౌరుకు స్పష్టంగా చెప్పారు.
స్వతంత్ర అభ్యర్థిగానైనా...?
అంతేకాకుండా ఇప్పుడు పోటీ చేస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా టీడీపీ కొనుగోలు చేసే అవకాశముందని, ఆ అవకాశం వారికి ఎందుకివ్వాలని జగన్ గౌరును ప్రశ్నించినట్లు తెలిసింది. దానివల్ల పార్టీకి నష్టమే కాని లాభమేదైనా ఉందా? అని కూడా ప్రశ్నించారు. అయితే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అందుకు అనుమతి ఇవ్వాలని కూడా గౌరు కోరారు. దీనికి కూడా జగన్ అంగీకరించనట్లు సమాచారం. దీంతో గౌరు వెంకటరెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా? అన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తన బంధువు శివానందరెడ్డికి టీడీపీ టిక్కెట్ దక్కక పోవడంతో గౌరు స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. గౌరు క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరుగుతుందని నమ్మకం పెట్టుకున్నారు. ఆయనకు టీడీపీకి చెందిన కొందరు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా మద్దతు తెలపడంతో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
గౌరు నిర్ణయంపై ఉత్కంఠ....
కాని జగన్ పోటీకే విముఖత చూపడంతో గాండ్లపేట నుంచి గౌరు వెంకటరెడ్డి తిరిగి కర్నూలుకు బయలుదేరారు. స్ధానికసంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ కు ఈరోజు సాయంత్రం వరకే చివరి గడువు. ఈ సాయంత్రం లోపు గౌరు నామినేషన్ వేయకుంటే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమయినట్లే. తన అనుచరులు, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత గౌరు నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద గౌరు నిర్ణయంపై ఇటు వైసీపీ, అటు టీడీపీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
- Tags
- జగన్

