గులాబీ బాస్ గురి చూసి కొడుతున్నారు....!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. జనంతో మమేకం అవుతున్నారు. పార్టీ నేతలను కూడా సమన్వయం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గులాబీ బాస్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న కేసీఆర్ ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వయంగా ప్రాజెక్టు పనులను ఆయన పర్యవేక్షించారు. రెండు రోజులుగా కేసీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలోనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆయన అడిగి తెలుసుకున్నారు. 18 నెలల్లో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టు పనులు 12 నెలల్లో 25 శాతం పూర్తి కావడంపై అధికారులు వివరణ ఇచ్చారు. వచ్చే జూన్ నాటికి పంప్ హౌస్ లను పూర్తి చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేలా చూడాలని అధికారులకు కేసీఆర్ సీరియస్ గా చెప్పారు. అలాగే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నేపల్లలి పంప్ హౌస్ లను కూడా పరిశీలించారు.
ముఖ్యనేతలతో సమావేశాలు....
ఇక రాత్రి వేళ ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని, టిక్కెట్లు రాని వారికి పార్టీలోనో, ప్రభుత్వంలోనూ ఏదో ఒక పదవి ఇస్తానని హామీలు ఇస్తున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటనను ఎంచుకోవడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం నిండింది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికను రచించుకుంటూ ముందుకు వెళుతున్న గులాబీ బాస్ అన్ని జిల్లాలను పర్యటించాలని నిర్ణయించుకున్నారు. పదవులు రాక అసంతృప్తులతో ఉన్నవారిని బుజ్జగించేందుకు కూడా కేసీఆర్ తన జిల్లాల పర్యటనలలో ఉపయోగించుకుంటున్నారు.
- Tags
- కేసీఆర్

