గులాబీ నేతలకు ఫిబ్రవరి ‘‘ఫీవర్’’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో పది రోజులు ఏంచేసినట్లు? త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? ఫాం హౌస్ లోనే దీనిపై కసరత్తు పూర్తయిందా? ఫిబ్రవరి మొదటి వారంలో కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారా? అవుననే అంటున్నాయి గులాబీ శ్రేణులు. దాదాపు పది రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాం హౌస్ లో ఉండి సన్నిహితులతో మంతనాలు జరిపారు. వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి.. కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయాలని కేసీఆర్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం ముఖ్యనేతలను తన ఫాం హౌస్ కు పిలిపించుకుని తొలగింపులు, చేర్పులపై చర్చించారు.
ఫాం హౌంస్ లో జాబితా రెడీ....
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత రెండుసార్లు మాత్రమే మంత్రి వర్గ విస్తరణ జరిగింది. అదీ ఉపముఖ్యమంత్రిని రాజయ్యను తొలగించిన తర్వాత కడియం శ్రీహరికి మంత్రి పదవిని ఇచ్చేందుకు విస్తరణ చేపట్టారు. అయితే తొలినుంచి ఉన్న మంత్రివర్గమేనేటికీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బయట నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కొన్ని విమర్శలు విన్పిస్తున్నాయి. ఉద్యమ సమయంలో పనిచేసిన వారిని కేసీఆర్ పక్కనపెట్టారని, మహిళలకు కేబినెట్లో స్థానం లేదని ఇప్పటికీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల సమయాన ఈ ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేసీఆర్ నిశ్చయించారు.
ఎన్నికల టీం రెడీ చేసేందుకు....
ఈనేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల టీమ్ ను రెడీ చేస్తున్నారని తెలసింది. ఇందులో నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించాలన్నది కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు జాబితా ఫైనల్ అయినట్లు కూడా గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. తుది కసరత్తు పూర్తయిందని, మేడారం జాతర పూర్తయిన తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం కేసీఆర్ ఖరారు చేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే సీనియర్లను ఫాంహౌస్ కు పిలపించుకుని దీనిపై చర్చించినట్లు చెబుతున్నారు.
ఆ నలుగురికి వేటు తప్పదా?
ఇప్పటికే కేసీఆర్ మంత్రివర్గంలో కొందరిపై అసంతృప్తితో ఉన్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గాని, శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో మంత్రులు విఫలమయ్యారని భావిస్తున్నారు. ఇందులో నెంబర్ వన్ గిరిజనశాఖ మంత్రి చందూలాల్ ఉన్నారు. ఆయన అనారోగ్యంతో చాలా కాలంగా శాఖకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మార్చాలని నిర్ణయించారు. ఇక హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించి ఆయనకు పార్టీలో కీలకమైన పదవి గాని, రాజ్యసభకు గాని పంపించే అవకాశముంది. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావును తప్పించి ఆయన స్థానంలో శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను నియమించాలనుకుంటున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో నలుగురికి మంత్రి పదవులున్నాయని పద్మారావును తప్పించడం ఖాయమన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కూడా తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కొత్త వారెవరంటే....
అయితే నలుగురిని తప్పించి కొత్త వారెవరనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. మండలి ఛైర్మన్ గా ఉన్న స్వామిగౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆయన స్థానంలో నారదాసు లక్ష్మణరావును నియమించే అవకాశముంది. ఇక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లాలో పట్టు మరింత పెంచుకునేందుకు పల్లాకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇక మహిళలకు స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో అనేక పేర్లను కేసీఆర్ పరిశీలించారు. కొండా సురేఖకు మంత్రి పదవి ఇద్దామనుకున్న తరుణంలో వారు కాంగ్రెస్ పార్టీకి వెళుతున్నారన్న ప్రచారంతో కొండా పేరు వెనక్కు వెళ్లినట్లు సమాచారం. ఇక కోవా లక్ష్మి పేరును పరిశీలించినా ఆమెకు ఇస్తే లంబాడీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వెనక్కు తగ్గారు. రేఖా నాయక్ పేరు పరిశీలనలోకి వచ్చినా ఆమెపై వచ్చిన అవినీతి ఆరోపణలు మైనస్ గా మారాయి. పద్మా దేవేందర్ రెడ్డికి ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయనట్లు తెలిసింది. మొత్తం మీద ఏ మహిళ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారన్నది ఇంకా తేలనట్లు ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గం ఖాయమని గులాబీ పెద్దలే చెబుతున్నారు.

