గుర్తు దొరికింది...బెర్త్ దొరుకుతుందా?

గుర్తులు దొరికాయి.... ఇక కేంద్రంలో బెర్త్ కూడా దొరుకుతుందా? కేంద్ర మంత్రి వర్గ విస్తరణ కొంతకాలం క్రితమే జరిగింది. అయినా మరోసారి మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు వాస్తవానికి 2019 లో జరగాల్సి ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు 2018 చివరి నాటికే ఎన్నికలకు వెళ్లాలన్నది మోడీ, అమిత్ షాల ఆలోచనగా ఉంది. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎన్నికలకు ముందుగా వెళ్లాలా? లేదా? అన్నది తేలిపోనుంది. అయితే గుజరాత్ ఎన్నికల తర్వాత మరోసారి కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. కొన్ని కీలక శాఖల్లో కూడా మార్పులు చేసే అవకాశముందంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని మంత్రి పదవుల నుంచి తప్పించి పార్టీ బాధ్యతలను అప్పగించాలన్న యోచన కూడా చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే మోడీ కసరత్తులు ప్రారంభించినట్లు కూడా బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
అన్నాడీఎంకే.. జీడీయూలకూ.....
మరోవైపు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే, జేడీయూ లకు కూడా ఈసారి కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు. గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఈ రెండు పార్టీలకూ చోటు దక్కలేదు. కారణం రెండు పార్టీలూ వర్గాలుగా విడిపోవడం, గుర్తు కోసం ఎన్నికల కమిషన్ వద్ద పంచాయతీ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం జేడీయూ పార్టీ, గుర్తు రెండూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కే దక్కాయి. నితీష్ కుమార్ వర్గం, శరద్ యాదవ్ వర్గాలు గుర్తు తమకే కావాలంటూ ఈసీని ఆశ్రయించడంతో చివరికి నితీష్ కే గుర్తు దక్కింది. తాజాగా అన్నాడీఎంకేలో కూడా శశికళ వర్గం, పన్నీర్, పళనిస్వామి వర్గాలు కూడా గుర్తు, పార్టీ తమదేనంటూ ఈసీని ఆశ్రయించాయి. ఇక్కడ కూడా చివరకు పళనిస్వామి వర్గానికే రెండాకుల గుర్తును కేటాయించింది. దీంతో ఇప్పుడు అధికారికంగా ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ రెండు పార్టీలూ ఇప్పటికే బీజేపీ మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. అందువల్ల అన్నాడీఎంకే, జేడీయూలకు సంబంధించి ముగ్గురి వరకూ కేంద్రంలో మంత్రిపదవులు ఇవ్వాలన్నది మోడీ ప్రయత్నం. జేడీయూ మాత్రం తమకు మూడు మంత్రి పదవులను కావాలని కోరుతోంది. మరి మంత్రి వర్గ విస్తరణ సమయంలో ఈ రెండు పార్టీలకూ చోటు దక్కే అవకాశముంది.

