గుత్తా కోరిక తీరిందే

ఎట్టకేలకు ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డికి అనుకున్న పదవి దక్కింది. చాలా రోజుల నుంచి వేచి చూస్తున్న పదవి గుత్తాకు అందివచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ తరుపున గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి అనంతర రాజకీయ పరిణామాల దృష్ట్యా గుత్తా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి వచ్చారు. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి చేపట్టాలన్నది కోరిక. మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకుంటారని గుత్తా సయితం భావించారు.
మంత్రివర్గంలో తీసుకుంటారని....
అయితే గుత్తా సుఖేందర్ రెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకోకుండా ఆయనకు వేరే బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసి దాని అధ్యక్షుడిగా నియమిస్తానని కేసీఆర్ గుత్తాకు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలుకు చాలా సమయం పట్టింది. గుత్తా కూడా అసంతృప్తికి గురయ్యారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో జరిగే చేరికలు కూడా గుత్తాను అసహనానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో గుత్తా కొన్నాళ్లుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు.
ఈ నెల 12న బాధ్యతలు....
అయితే గుత్తా సుఖేందర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి కేబినెట్ ర్యాంక్ ఉన్న పదవి. గుత్తాతో పాటుగా నలుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది. ఏడాదినుంచి ఎదురు చూస్తున్న పదవి ఎట్టకేలకు గుత్తా దరి చేరింది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ నెల 12న బాధ్యతలను స్వీకరించనున్నారు. మొత్తానికి గుత్తా కోరిక తీరినట్లే.
