గుజరాత్లో బీజేపీని గెలిపించింది వీళ్లే...!

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి హోరాహోరీగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి అధికారానికి చేరువవుతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ పరిశీలిస్తే బీజేపీ 108 స్థానాల్లోను, కాంగ్రెస్ 72 స్థానాల్లోను ఆధిక్యంలో ఉంటే ఇతరులు 3 స్థానాల్లో దూసుకు పోతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు ముందుగా బీజేపీ ఆధిక్యంలోకి వెళ్లగా, ఆ తర్వాత కాంగ్రెస్ ఆధిక్యంలోకి రావడంతో ఉత్కంఠ మొదలైంది. ఆ తర్వాత తిరిగి బీజేపీ పుంజుకుని స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకు వెళుతోంది.
పట్టణ ప్రాంతాలే....
ఇక గుజరాత్లో బీజేపీని పట్టణ ప్రాంత ఓటర్లే గట్టెక్కించినట్టు కనపడుతోంది. రెండో దశ ఎన్నికల్లో మోడీ చేసిన వ్యాఖ్యలు, ఆయన మంత్రాంగమే బీజేపీకి విజయం చేకూర్చాయి. రెండో దశ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీతోనే బీజేపీ గెలుపు దిశగా వెళుతోంది. ఇక పట్టణ ప్రాంత ఓటర్లే బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యం సాధించింది.
పల్లెల్లో కాంగ్రెస్ కు...
గ్రామీణ ప్రాంతాలతో, ఇతరత్రా పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. ఇక గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో ఆరు జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. ఇక కాంగ్రెస్ కూడా రెండు జిల్లాల్లో ఖాతా తెరవలేదు. బీజేపీ ఆమ్రేలీ, నర్మద, పోరు బందర్, ఆనంద్, డాంగ్స్, తాపీ జిల్లాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక కాంగ్రెస్ నవ్పారి, అర్వాలి జిల్లాల్లో ఖాతా తెరిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల విషయానికి వస్తే దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, సెంట్రల్ గుజరాత్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంటే సౌరాష్ట్రలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
- Tags
- బీజేపీ

