గుజరాత్ లో హార్ధిక్ కు ఎదురుదెబ్బ

గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎవరు ఎటు పక్క ఉంటారో? ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గుజరాత్ ను ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ, కొన్నేళ్ల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రతి అవకాశాన్ని ఏ పార్టీ వదులుకోవడం లేదు. గుజరాత్ లో పటేళ్ల ఉద్యమం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. పాటిదార్ లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ పెద్దయెత్తున ఉద్యమం కూడా జరుగుతోంది. ఈ ఉద్యమానికి హార్థిక్ పటేల్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన నిర్వహించిన సభలకు లక్షల సంఖ్యలో పటేళ్లు హాజరయ్యేవారు. హార్ధిక్ పటేల్ ను కొన్నేళ్ల పాటు రాష్ట్రం నుంచి బహిష్కరించారు కూడా. ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.
బీజేపీలో చేరిన ప్రధాన అనుచరులు.....
పటేల్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గుజరాత్ లో ఆ వర్గం నేత హార్దిక్ పటేల్ ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు విశ్వప్రయత్నాలు చేశాయి. హార్దిక్ పటేల్ మద్దతుంటే పటేల్ సామాజిక వర్గం మొత్తం తమవెంటే ఉంటుందని భావించిన పార్టీలు ఆ దిశగా హామీలు గుప్పిస్తూ హార్ధిక్ పటేల్ మద్దతును బీజేపీ, కాంగ్రెస్ లు కోరాయి. అయితే హార్ధిక్ పటేల్ మాత్రం కొంత కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తామని చెప్పినా హార్థిక్ అంగీకరించలేదు. అయితే హార్ధిక్ పటేల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వరుణ్ పటేల్, రేష్మ పటేల్ లు బీజేపీ గూటికి చేరిపోయారు. ఇది ఖచ్చితంగా హార్థిక్ కు ఎదురుదెబ్బే. అయితే బీజేపీలో చేరిన ఈ ఇద్దరు మాత్రం అధికార పార్టీ తమకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని అందుకే అందులో చేరిపోయామని చెబుతున్నారు. అయితే తన ఇద్దరు మిత్రులూ బీజేపీలో చేరడంపై హార్ధిక్ పటేల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన కాళ్లు విరిగిపోయినా.. ప్రయాణం ఆగదని పేర్కొన్నాడు.
- Tags
- హార్దిక్ పటేల్

