గుజరాత్ లో వీటిపైనే దృష్టి....!

గుజరాత్ లో మొదటి దశ ఎన్నికల ప్రచారం పూర్తయింది. ఈరోజుతో ప్రచారం ముగియడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 9వ తేదీన గుజరాత్ తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 89 నియోజకవర్గాల్లో మొత్తం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అనేక చోట్ల హోరాహోరీ తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు స్వయంగా చేపట్టారు. వీరితో పాటు బీజేపీ తరుపున కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ లు కూడా ప్రచారం చేశారు.
కీలక స్థానాలున్న ప్రాంతంలో....
తొలివిడత ఎన్నికలు జరుగుతున్న 89 అసెంబ్లీ నియోజకవర్గాలు గుజరాత్ లోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లో ఉన్నాయి. సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో ఎవరికి సీట్లు ఎక్కువగా వస్తాయో వారే గుజరాత్ పీఠాన్ని చేజిక్కించుకుంటారన్న సెంటిమెంట్ ఉంది. గత నాలుగు ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. తొలిదశ జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ రూపానీ నియోజకవర్గం కూడా ఉంది. ఆయన రాజ్ కోట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లలో 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ ఇక్కడ వారం రోజుల పాటు పర్యటించారు. మరి ఎల్లుండే ఎన్నికలు. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఈ ప్రాంతంలో మైకులు మాత్రం మూగవోయాయి.
- Tags
- గుజరాత్

