గుజరాత్ లో బీజేపీకి ఎదురుదెబ్బ

గుజరాత్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార బీజేపీలో అసంతృప్త నేతల బయటపడుతున్నారు. రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇరవై ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా గుజరాత్ గద్దెనెక్కాలని యోచిస్తోంది. అందుకోసం అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. తొలిదశ ఎన్నికలు వచ్చే నెల 9వ తేదీన జరగనున్నాయి. తొలివిడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. మొత్తం నాలుగు దశల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 132 మంది అభ్యర్థులను ఇప్పటి వరకూ ప్రకటించింది.
సీనియర్ నేత రాజీనామా...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆయన అన్ని సర్వేలు తెప్పించుకున్న తర్వాతనే టిక్కెట్లను ఖరారు చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థుల ఎంపికకు ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమించి జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కాంజీభాయ్ పటేల్ బీజేపీకి రాజీనామా చేశారు. టిక్కెట్ల పంపిణీలో తమకు చోటు దక్కకపోవడంతో కాంజీభాయ్ తీవ్ర ఆవేదన చెందారు. కాంజీభాయ్ పటేల్ తన కుమారుడు సునీల్ పటేల్ కు టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే నాలుగు జాబితాల్లో సునీల్ పటేల్ పేరు లేకపోవడంతో కాంజీభాయ్ పటేల్ అతని కుమారుడు సునీల్ పటేల్ బీజేపీకి రాజీనామా చేశారు. గందేవి నియోజకవర్గం నుంచి సునీల్ పటేల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంజీభాయ్ ప్రకటించారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీకి కాంజీభాయ్ పటేల్ రాజీనామా వ్యవహారం తలనొప్పిగా మారింది.
- Tags
- గుజరాత్ బీజేపీ

