గుజరాత్ ఫలితాలు చూసి టీడీపీలో జోష్ ఎందుకంటే?

గుజరాత్ ఫలితాలతో ఏపీలోని తెలుగుదేశం పార్టీలో నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లోనూ గుజరాత్ తరహాలోనే తాము కూడా విజయం సాధిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. గుజరాత్ లో 22 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ అభివృద్ధి నినాదంతోనే బీజేపీ ఆరోసారి గెలిచింది. అదే సూత్రాన్ని తమకూ అన్వయించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఏపీ గత మూడున్నరేళ్లుగా అభివృద్ధి దూసుకుపోతోందని, పోలవరం నిర్మాణం, రాజధాని భవనాలు తమను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. గుజరాత్ ఫలితాలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఈరోజు ఉదయం నుంచి ఆసక్తిగా గమనించారు. ఒక దశలో కాంగ్రెస్ పుంజుకోవడంతో కొంతఅయోమయానికి గురైనా చివరకు బీజేపీదే విజయం ఖాయమవ్వడంతో ఏపీలో కూడా అదే ఫలితాలు రిపీట్ అవుతాయని వారు అంటున్నారు.
కుల రాజకీయాలు పనిచేయవని....
ఏపీలోనూ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే కాబట్టి అభివృద్ధి నినాదమే వచ్చే ఎన్నికల్లో తమను గట్టెక్కిస్తుందంటున్నారు. అంతేకాకుండా గుజరాత్ లో కులాల ప్రభావం పెద్దగా పనిచేయకపోవడాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏపీలోనూ కులసమీకరణలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా గుజరాత్ సూత్రమే వర్తిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు లాంటి నేత రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారని, ఆయనకు మరోసారి సీఎం పదవి ఇవ్వకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్నది ఏపీ ప్రజలకు తెలియంది కాదని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీనియర్ నేతలతో సమీక్ష చేశారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తే వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేసినట్లు సమచారం.
బీజేపీ నేతల్లోనూ...
మరోవైపు ఏపీ బీజేపీనేతల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. మోడీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని ఆ పార్టీ నేత సోము వీర్రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాషాయ జెండా ఎగురవేస్తామని చెప్పారు. అమిత్ షా ఇకపై తెలుగు రాష్ట్రాలపై దృష్టిపెట్టనున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉందని, మోడీ హవా తోడయితే ఇక్కడ గెలుపు తమకు అంత కష్టమేమీ కాదని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద గుజరాత్ లో బీజేపీ గెలుపుపై ఇటు తెలుగు తమ్ముళ్లు, అటు కమలనాధులు ఎవరికి వారే తమకు తాము అన్వయించుకుంటూ లెక్కలు వేసుకుంటుండటం గమనార్హం.
- Tags
- టీడీపీ

