గుజరాత్ ఫలితాలతో జగన్ తన బలం తెలుసుకున్నారా?

గుజరాత్ ఎన్నికల నుంచి వైసీపీ అధినేత జగన్ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. కేవలం పాదయాత్ర మాత్రమే కాదు ఎలక్షన్ ఇంజనీరింగ్, పోల్ మేనేజ్ మెంట్ ను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. జగన్ కు ఇప్పుడు పెద్ద బలం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ సేవలను విరివిగా వాడుకోవాలని జగన్ ఇప్పటికే నిర్ణయించారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎదురుదెబ్బ తినడానికి స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదు. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి పడే ఓట్లు కూడా పడకుండా చేశాయన్నది విశ్లేషకుల అంచనా. ఇదే పరిస్థితి ఏపీలో తలెత్తకూడదు. ముఖ్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి వాళ్లను కట్టడి చేయాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలకు దిగకుండా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని వ్యక్తిగత దూషణలకు దిగితే భంగపాటు తప్పదని గుజరాత్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో పటిష్ట నాయకత్వంతోనే...
అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను కూడా పార్టీ నేతలు పూర్తిగా వినియోగించుకోవాలంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు. ఆయన చెప్పినట్లు నడచుకుంటే ఖచ్చితంగా విజయం తథ్యమని, గుజరాత్ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోలికే లేదన్నది కొందరి అభిప్రాయం. గుజరాత్ లో బూత్ స్థాయిలో బీజేపీ పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పరచుకోవడం వల్లనే గెలుపు సాధ్యమయిందని, పార్టీ కూడా అదే నిర్మాణాన్ని చేయాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రచారంలో కొత్త పోకడలను అవలంబించడం వల్లనే మోడీ పార్టీ అక్కడ విజయం సాధించిందంటున్నారు. తమ నేత కూడా ఆలయాల బాట పట్టింది అందుకేనని వైసీపీ నేతలు కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రజల్లో మమేకమవుతూ పాదయాత్ర కొనసాగిస్తూనే పార్టీని బూత్ లెవల్లో పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ అభిమానులు కోరుతున్నారు. జగన్ పార్టీలో ప్రస్తుత మున్న బలహీనతలను తొలగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
- Tags
- జగన్

