గుజరాత్..ఏపీలో వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టిందే...!

బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ నేత సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా చేశాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలోకూడా బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విరుచుకుపడ్డారు. గుజరాత్ ఎన్నికలు ఎలా జరిగాయో చూశామని, బీజేపీ ఇక్కడ పగటి కలలు కనడం మానుకోవాలని సోము వీర్రాజుపై మండిపడ్డారు. తన బలమేంటో తెలుసుకోకుండా గుజారత్ ఎన్నికల ఫలితాలను చూసి మురిసిపోతే లాభం లేదన్నారు.
పొత్తుకు మేం తహతహలాడటం లేదు....
అయితే దీనికి సోమువీర్రాజు తాజాగా మరో కౌంటర్ ఇచ్చారు. తాము 1999లోనే అన్ని నియోజకవర్గలకు పోటీ చేశామని, ప్రతి పార్లమెంటు స్థానంలో 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు నేషనలిస్ట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రధానిని చేసిన విషయాన్ని మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. తామకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అన్యాయమే జరిగిందన్నారు. తమకు ఇచ్చిన సీట్లలో కూడా టీడీపీ రెబల్ అభ్యర్థిని బరిలోకి దించిందన్నారు. అందువల్ల తాము కొన్ని చోట్ల ఓటమిపాలయ్యామన్నారు. పొత్త పెట్టుకోవడం వల్లనే కొన్నేళ్లుగా బీజేపీ కార్యకర్తలు నష్టపోతున్నారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పింఛన్లు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తాము 5 వేల ఓట్లు సాధించగలిగే సత్తా ఉందని, అది ఎవరికి నష్టమో తేల్చుకోవాలని సోము సున్నితంగా టీడీపీని హెచ్చరించారు. పొత్తుకోసం తామేమీ తహతహలాడటం లేదన్నారు. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీయే పొత్తుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా తమకు ఉందని తెలిపారు.
చంద్రబాబు సీరియస్....
రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. బీజేపీ నేతలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ను చంద్రబాబు హెచ్చరించారు. బీజేపీ నేతలవ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేయాలన్నారు. బీజేపీపై ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా తాను అంగీకరించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఆంద్రప్రదేశ్ లోని మిత్రపక్షం మధ్య చిచ్చుపెట్టాయి.

