గుజరాత్ ఎంత పనిచేసింది?

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమిపాలయినా... ఆ ఎన్నికలే ఇప్పుడు కాంగ్రెస్ కు జీవం పోశాయంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో నువ్వా? నేనా? అన్నట్లు పోటీనిచ్చి ప్రధాని మోడీకి సొంత రాష్ట్రంలోనే చుక్కలు చూపించడంలో ఏఐసీసీ అధ్కక్షుడు రాహుల్ సక్సెస్ అయ్యారంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల మనోగతం కాదు. దేశ ప్రజల్లో అత్యధికశాతం మంది రాహుల్ ను తెగపొగిడేస్తున్నారు. ప్రధానిగా రాహుల్ తగిన వ్యక్తి అని మెచ్చుకుంటున్నారు. ఒకవైపు రాహుల్ ఇమేజ్ పెరుగుతుండగా, ప్రధాని మోడీ ఆకర్షణ తగ్గుతుందన్నది తాజా అధ్యయనాల్లో వెల్లడయింది.
తాజా సర్వేలో రాహుల్ కు....
లోక్ నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలెపింగ్ సొసైటీస్ అనే సంస్థ ఇటీవల దేశంలో అనేక రాష్ట్రాల్లో సర్వే చేసింది. మొత్తం 19 రాష్ట్రాల్లో 175 నియోజకవర్గాల్లో ఈ సంస్థ ప్రతినిధులు ప్రజల పల్స్ ను తెలుసుకున్నారు. అలాగే ఈ సర్వేలో 14,336 మందిని తమ ప్రశ్నలను అడిగారు. ఈ సర్వేలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కాంగ్రెస్ ముందు వరుసలో ఉందని తేలింది. ఇక కార్పొరేషన్ పరిధుల్లో మాత్రం బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ప్రధానంగా రైతులు, వ్యాపార వర్గాలు మోడీ ప్రభుత్వం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. కాంగ్రెస్ హయాంలోనే తమ సమస్యలు పరిష్కారమయ్యాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.
నైరాశ్యంలో యువత.....
అయితే బీజేపీకి గతంలో యువత ఎక్కువగా మద్దతిచ్చేవారు. అయితే గత ఏడాదిగా వీరి మద్దతు మోడీ పార్టీకి తగ్గుతూ వస్తుందని సర్వేలో తేల్చారు. ఇందుకు ప్రధాన కారణం నిరుద్యోగమేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే దక్షిణాదిరాష్ఠ్రాల్లో ప్రధాని పదవికి మోడీ కన్నా రాహుల్ కే మార్కులు పడటం విశేషం. మోడీ ప్రధాని కావాలని 24 శాతం మంది అభిప్రాయపడగా, రాహుల్ ప్రధాని కావాలంటూ 27 శాతం మంది చెయ్యెత్తారు. మోడీకి 2014 ఉన్న ఇమేజ్ కంటే తగ్గిందని, రాహుల్ ప్రభావం పెరిగిందని ఈ తాజా సర్వేలో తేల్చారు. అయితే ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు జరిగితే 34 శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో పడతాయని ఇందులో తేలడం బీజేపీకి కొంత ఊరటనిచ్చే అంశం. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా రాహుల్ ఇమేజ్ క్రమంగా పెరుగుతుండటం కమలనాధులకు ఆందోళన కలిగించే అంశమే.

