గుంటూరులో ఎంపీ గల్లా vs ఎమ్మెల్యే శ్రావణ్

చంద్రబాబు క్రమశిక్షణ అంటారు. అవినీతిని సహించనంటారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించోనని... చండశాసనుడినని ప్రకటించుకుంటారు. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. నేతలే అవినీతికి పాల్పడుతూ... కాసుల కోసం కొట్లాటకు దిగే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఎవరైనా ఉచితం ఇసుకను తీసుకోవచ్చు. అయితే రవాణాఛార్జీలు మాత్రం భరించాల్సి ఉంటుంది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సభల్లోనూ ప్రకటించారు. తాజాగా చంద్రబాబు కొలువైన రాజధానికి కూతవేటు సమీపంలో ఇసుక క్వారీల కోసం తెలుగుతమ్ముళ్లు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. ఏపీ రాజధాని ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఇసుక క్వారీలున్నాయి. అయితే ఇక్కడ తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ వర్గాల మధ్య వార్ నడుస్తోంది.
ఉచిత ఇసుకను అమ్ముకుంటూ......
ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వర్గీయులు తమను ఉచితంగా ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ గల్లా జయదేవ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తుళ్లూరు మండలంలోని అన్ని క్వారీలను తన అనుచరులే చూసుకుంటురాని శ్రావణ్ కుమార్ తెగేసి చెబుతున్నారని ఎంపీ అనుచరులు విమర్శిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ అంతర్గతంగా ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. రాయపూడి ఇసుక క్వారీలో రెండు వర్గాలూ కొట్లాటకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ రాయపూడి రీచ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి, సచివాలయానికి అతి దగ్గరలోనే ఉండటం విశేషం. ఎమ్మెల్యే అనుచరులు ఇసుకను వేల రూపాయలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇసుకను భారీగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దీనిపై రగడ జరగడంతో వివాదం మరింత ముదిరింది. ఏపీ రాజధాని ప్రాంతంలో మొత్తం ఆరు ఇసుక రీచ్ లు ఉన్నాయి. భవిష్యత్ లో రాజధాని నిర్మాణ పనుల అవసరం కోసం ఈ ఇసుకను ఉపయోగించాలని ఒక పక్క ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎమ్మెల్యే, ఎంపీ అనుచరవర్గం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇసుకను అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. క్వారీలోనే ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలూ ఘర్షణకుదిగడంతో సమస్య జటిలంగా మారింది.

