గీత దాటారంటున్న వైసీపీ

వైసీపీ పార్లమెంటు సభ్యురాలు కొత్త పల్లి గీతకు ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొత్త పల్లి గీత ఇటీవల తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆమె లేచి నిలబడలేదని, విప్ జారీ చేసినా థిక్కరించారని ఆ పార్టీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి గీతకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనికి వివరణ ఇవ్వాలని కూడా వైవీ కోరారు. అవిశ్వాస తీర్మానం స్పీకర్ చదువుతున్నప్పుడు వైసీపీ ఎంపీలందరూ లేచి నిలబడినా, గీత మాత్రం కూర్చుండి పోయారు. ఇది గమనించిన వైసీపీ నేతలు ఆమెకు నోటీసు ఇచ్చారు.
బీజేపీకి అనుకూలంగా....
వైసీపీ గుర్తు మీద గెలిచిన గీత ఎన్నికలు పూర్తయిన వెంటనే పార్టీని వీడి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతుగా లేరు. ఆమె బీజీపీకి, ప్రధాని మోడీకి అనుకూలంగా ఉన్నట్లు అనేకసార్లు ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రధాని మోడీతో నిన్న పార్లమెంటులో గీత భేటీ అయ్యారు. ఏపీకి సాయం చేయాలని కోరారు. తాము ఏపీకి సాయం చేస్తామని, కాని వైసీపీ, టీడీపీలే అడ్డుపడుతున్నాయని ప్రధాని తనతో అన్నట్లు గీత చెబుతున్నారు.
బెదిరేదు లేదంటున్న.....
ఇదిలా ఉండగా వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు తనకు వర్తించవన్నారు గీత. అవిశ్వాసం చర్చకు వచ్చినప్పుడే వైసీపీ జారీ చేసిన విప్ పనిచేస్తుందని, రూలింగ్ ఇచ్చినప్పుడు పని చేయదని గీత చెబుతున్నారు. తనను వైసీపీ మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి నోటీసులు ఇస్తుందన్నారు. ఇటువంటి నోటీసులకు తాను భయపడబోనని చెప్పారు. వైసీపీ తనపై వ్యక్తిగత కక్ష పెట్టుకుందన్నారు గీత. అవిశ్వాసం చర్చకు వచ్చినప్పుడు విప్ కు అనుకూలంగా నడుచుకుంటానని చెప్పారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరనన్నారు. మొత్తం మీద గీతకు వైసీపీ షోకాజు నోటీసులివ్వడం పార్లమెంటు హాలులో చర్చనీయాంశమైంది.
- Tags
- కొత్తపల్లి గీత
