గవర్నర్తో బాబు : ఏకాంత చర్చ కేబినెట్ పైనే?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో శుక్రవారం రాజ్భవన్లో సమావేశం అయ్యారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భేటీ సందర్భంగా చంద్రబాబునాయుడుతో తన అనుబంధాన్ని గవర్నర్ నెమరు వేసుకున్నారు. చంద్రబాబు తనకు పాత మిత్రుడు అని, తాను గవర్నరు కాక ముందు నుంచి కూడా ఆయన తనకు మిత్రుడని నరసింహన్ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సమావేశంలో గవర్నరుతో చంద్రబాబునాయుడు సుమారు అరగంటకు పైగా ఏకాంతంగా కూడా సమావేశం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబునాయుడు ఏపీలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ గురించిన అంశాలమీదనే ఈ ఏకాంత భేటీలో చర్చించి ఉండవచ్చని ఊహాగానాలు నడుస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నరుతో భేటీ అయినప్పుడు చర్చించుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి. మనకు కూడా కృష్ణా జలాల పంపకాల వివాదం దగ్గరినుంచి, విభజన చట్టంలోని ఆస్తుల పంపకం లాంటి అనేక అంశాలు ఉండనే ఉన్నాయి. పైగా హైదరాబాదులోని సచివాలయ భవనాల అప్పగింత వ్యవహారం కూడా తాజా వివాదంగా నడుస్తోంది. తక్షణం భవనాలు కావాలని కోరుతున్న కేసీఆర్ కోరికను చంద్రబాబుకు , గవర్నరే స్వయంగా తెలియజేశారు. అయితే కేసీఆర్ నుంచి ప్రస్తుతం అంత ఒత్తిడి ఉండకపోవచ్చు. ఆయన తమ సొంత రాష్ట్ర భవనాలనే కూల్చడానికి కోర్టు బ్రేకులు వేసిన తర్వాత.. ఏపీ భవనాలు తిరిగి తీసుకోవడంలో జాప్యమైనా పెద్ద పట్టించుకోకపోవచ్చు. పైగా దీనిమీద చంద్రబాబు ఎటూ కేబినెట్ సబ్ కమిటీ వేసేశారు. ఇంకా పెద్దగా చర్చించడానికి ఏమీ ఉండకపోవచ్చ కూడా.
ఈ నేపథ్యంలో భవనాల గురించి కాకుండా కేబినెట్ విస్తరణ గురించే ఏకాంత భేటీ ఉండచ్చుననేది పలువురి అంచనాగా ఉంది. చంద్రబాబు కేబినెట్ విస్తరణ చాలా కాలంగా పెండింగులో ఉంది. విస్తరణ జరిగితే లోకేష్ ను కూడా కేబినెట్ లోకి తీసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నరుతో అవే అంశాలు చర్చకు వచ్చి ఉండొచ్చునని అనుకుంటున్నారు.

