గవర్నర్ అలా....సీఎం ఇలా.. ఎప్పటి వరకూ?

పాండిచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి నారాయణస్వామి మధ్య విభేదాలు సమసి పోయేట్లు లేవు. గవర్నర్ పెత్తనాన్ని తాము సహించేది లేదంటూ నారాయణస్వామి తీవ్రంగానే హెచ్చరించారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు ముఖ్యమంత్రి రెడీ అయిపోతున్నారు. పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ నియామకం జరిగినప్పటి నుంచి అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేదు. అధికారంలో ఉన్నామా? లేక విపక్షంలో ఉన్నామా? అన్న సందేహాన్ని కాంగ్రెస్ నేతలే అనేక సందర్భాల్లో వెలిబుచ్చారు. ముఖ్యంగా నియామకాలు, ఫైళ్లుకదలాలంటే లెఫ్ట్ నెంట్ గవర్నర్ వేస్తున్న కొర్రీలు ముఖ్యమంత్రి నారాయణస్వామికి అసహనం కల్గిస్తున్నాయి.
గవర్నర్ నిర్ణయాలపై గుర్రు....
గతంలో కూడా అనేకసార్లు అధికారులతో సమీక్షలు చేసిన కిరణ్ బేడీ నేరుగా నిర్ణయాలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కూడా నిర్ణయించింది. ఏడాదిగా జరుగుతున్నవీరి మధ్య వివాదం గత కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. నారాయణ స్వామి కూడా గత కొంతకాలంగా కిరణ్ బేడీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దాన్ని పాటించారు. అయితే ఇటీవల కిరణ్ బేడీ మరోసారి అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. అయితే దీనిపై నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న తాము నిర్ణయాలు తీసుకోకుండా, నామినేట్ అయిన వాళ్లు ఎలా రాష్ట్రాన్ని డ్రైవ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం వద్ద పంచాయతీ....
అయితే ఈ విషయంపై కిరణ్ బేడీపై నేరుగా విమర్శలకు దిగకుండా ఢిల్లీలోనే తేల్చుకోవడానికి నారాయణస్వామి సిద్ధమయ్యారు. త్వరలోనే ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు రాష్ట్రపతిని కూడా కలిసి కిరణ్ బేడీపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అయితే కిరణ్ బేడీ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. తన పని తాను చేసుకు పోతున్నారు. తన విధులను అనుసరించే పనిచేస్తున్నానని ఆమె చెబుతున్నారు. ఎవరి విధుల్లోనూ తాను జోక్యం చేసుకోవడం లేదంటున్నారు. రాష్ట్రంలో కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ఆందోళనలు కూడా ప్రారంభమయ్యాయి. తమకు తెలియకుండా మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేయడంపై పాలక పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద మరోసారి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి నారాయణస్వామిల పంచాయతీ మరోసారి ఢిల్లీకి చేరనుంది.

