గద్వాల జిల్లా రగడ : అరుణ మీద గులాబీ రాళ్లు!!

గద్వాల జిల్లాను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించి ఉండవచ్చు గాక.. అయితే దానికి సంబంధించిన క్రెడిట్ మాత్రం ఇసుమంత అయినా.. డికె అరుణ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేలా అధికార తెరాస జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుంది. సిరిసిల్ల, జనగామ జిల్లాల విషయంలో వ్యవహరించినట్లుగా , కేవలం ప్రజల మనోభిప్రాయాలను, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, వాటిని గౌరవించే గద్వాల జిల్లాకు కూడా ఓకే చెప్పారు తప్ప.. అందులో అరుణ వల్ల సాధించిందేమీ కాదని తెరాస శ్రేణులు అప్పుడే ప్రచారం ప్రారంభించాయి.
గద్వాల జిల్లాకు కూడా కేసీఆర్ ఓకే చెప్పినందుకు డికె అరుణ థాంక్స్ చెప్పారు. పరోక్షంగా ఆ జిల్లా ఏర్పాటు క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ఆమె ప్రయత్నించారు. అయితే కేవలం జిల్లాల వ్యవహారం వార్తల్లోకి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే తెరాస ఎంపీ బాల్క సుమన్ తెరమీదికి వచ్చారు. అంబేద్కర్ ఆశయాల ప్రకారమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందంటూ ఆయన తనదైన వ్యాఖ్యానం వినిపించారు.
జనగామ, సిరిసిల్ల జిల్లాల విషయంలో క్రెడిట్ ను హైజాక్ చేసేవాళ్లు మరెవ్వరూ వారికి కనిపించలేదేమో గానీ.. గద్వాల జిల్లా విషయంలో అది అరుణ వల్ల ఎంతమాత్రమూ వచ్చింది కాదంటూ ప్రచారం చేయడానికి బాల్క సుమన్ చాలా ప్రయత్నించడం విశేషం. అరుణ అసలు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామానే చేయలేదని బాల్కసుమన్ అభివర్ణించారు. ఆమె గద్వాల ను జిల్లా చేయడానికి నిజమైన పోరాటం చేయలేదని, చిల్లర రాజకీయాలు చేశారని ఆయన పేర్కొనడం విశేషం. రాజీనామా అనే డ్రామా ద్వారా.. గద్వాలకు జిల్లా సాధించడం కంటె తనకు ఎమ్మెల్యే పదవి ఎక్కువ ముఖ్యమని అరుణ నిరూపించుకున్నారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. అలాగే.. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలియకుంటే, తెరాస నేతలను అడిగి ఉంటే ఆమెకు నేర్పి ఉండేవారమంటూ సుమన్ హేళన చేయడం విశేషం.

