కర్నూలు ఎమ్మెల్సీ రేసులో ఇద్దరే ఇద్దరు!

కర్నూలు స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ పదవికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి గత నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా తన అన్నకోసం ఈ సీటుకు రిజైన్ చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దీనికి నోటిఫికేషన్ కూడా ప్రకటించింది. ఈ నెల 19నే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 26తో నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. అంటే మంగళవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 12న ఎన్నిక నిర్వహించి అదే నెల 16న రిజల్ట్‌ను ప్రకటిస్తారు. కాగా, మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికలో 1084 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.
కేవలం 70 ఓట్ల మెజార్టీయే...
అయితే, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో నిలిచిన శిల్పాకి కేవలం 70 ఓట్ల మెజారిటీనే రావడం గమనార్హం. ఇక, ఇప్పుడు ఆయన వైసీపీలో ఉండడంతో ఈ ఎన్నిక మరీ ఉత్కంఠకు దారితీసింది. ఇక, ఈ సీటుకు సంబంధించి అధికార టీడీపీ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు జిల్లాలో నేతల వద్దకు విస్తృతంగా పర్యటించారు. వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బరిలో దిగాలని భావిస్తున్న నేతల బలాబలాలపైనా మంత్రి కాల్వ ఓ అంచనాకు వచ్చారు. దీంతో ఇప్పటికే ఆయన తన పరిశీలనలో తెలిసిన విషయాలను టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదిక రూపంలోనూ అందించారని సమాచారం.
అభిప్రాయాలు సేకరించి...
ఇదిలావుంటే, బాబు కూడా స్వయంగా జిల్లా మంత్రులు, నేతల అభిప్రాయాలను విడివిడిగా చర్చించి తీసుకున్నారని సమాచారం. దీనిని బట్టి ఆయన త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తారని అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో రేసులో ఉన్న ఇద్దరు ప్రముఖుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్, రెండు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిలు. వీరిద్దరూ గట్టిగా బరిలోకి దిగాలని అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. కేఈ ప్రభాకర్‌కు స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్న కృష్ణమూర్తి.. తనదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నారని, సీఎం వద్ద ఇప్పటికే రెండు సార్లు ఆయన తన తమ్ముడికి ఇచ్చి తీరాలని కూడా తెగేసి చెప్పారని సమాచారం.
బలమైన పోటీ....
అయితే, ఇప్పటికే కేఈకి మంత్రి పదవి కూడా ఇచ్చిన నేపథ్యంలో తమ్ముడికి ఎమ్మెల్సీ అంటే ఏదైనా తేడా వస్తుందేమోనని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. అయితే, కాదని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. ఇక, శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే.. సొంత మామ ఎస్పీవై రెడ్డి ఈయనకు టికెట్ ఇప్పించేందుకు బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో విజయం సాధించడం ఖాయంగా ఈయన హామీ కూడా ఇస్తున్నాడట. దీంతో వీరిద్దరి మధ్యే టికెట్ కోసం బలమైన పోటీ నడుస్తోందని అంటున్నారు. దీనిపై సోమవారం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

