క్షమించమంటూ...విలపిస్తూ

ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ భావోద్వేగానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికాతో బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో తప్పంతా తనదేనని కన్నీళ్ళ పర్యంతమై మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చాడు. క్రికెట్ తో తన జీవితం విదీయలేనిదని త్వరలోనే జట్టుతో ఆడతానని అన్నాడు. ఇవే వ్యాఖ్యలను డేవిడ్ వార్నర్ చేశాడు. క్షమించమని క్రికెట్ ఫ్యాన్స్ ను వేడుకున్నాడు. అంతేకాదు తప్పును ధైర్యంగా అంగీకరించాడు. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ ఎపిసోడ్ లో కోచ్ డారెన్ లీమన్ క్షమాపణలు కోరాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
తప్పును ధైర్యంగా ఒప్పుకోవడంతో....
ఆస్ట్రేలియా దేశానికే మచ్చ తెచ్చే పని చేసిన వారందరిపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. అయితే వారు చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడటంతో ఫ్యాన్స్ చాలా వరకు శాంతించారు. ఏడాదిపాటు వీరు ఆస్ట్రేలియన్ క్రికెట్ కి నిషేధం కారణంగా దూరంగా వుండాలిసి రావడంతో తమ భవిష్యత్తుపై వీరిద్దరూ ఆందోళన చెందుతున్నారు. అద్భుత ఆటతీరుతో అలరించే ఇరువురు ఆటగాళ్ల కెరియర్ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కి ఐపీఎల్ లో సారధ్యం వహించాలిసిన స్మిత్ తప్పుకోగా అజింక్య రహానే ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కి నేతృత్వం వహించే డేవిడ్ వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కెవిన్ విలియమ్స్ సారధ్యం చేయనున్నాడు. మొత్తానికి రాబోయే ఐపీఎల్ లో స్మిత్, వార్నర్ ఆటను ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు
