క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూత

క్యూబా కు ప్రధానిగా, అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన ఫిడెల్ క్యాస్ట్రో శనివారం కన్నమూశారు. ఫిడెల్ క్యాస్ట్రో 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా పనిచేశారు. 1976 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. 1926 ఆగస్టు 13న బిరాన్ లోని హోల్గిన్ లో ఆయన జన్మించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిడెల్ క్యాస్ట్రో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
విప్లవ నాయకుడిగా, క్యూబా కొదమ సింహంగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఫిడెల్ క్యాస్ట్రో కన్నుమూయడంతో క్యూబా విషాదంలో మునిగిపోయింది.
లాటిన్ అమెరికా దేశాలలో క్యూబాను మొదటి సామ్యవాద దేశంగా ఫిడెల్ క్యాస్ట్రో మార్చారు. 1952లో క్యూబా ప్రతినిధుల సభకోసం జరిగిన ఎన్నికల్లో పోటీచేశారు. అదే సంవత్సరంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అమెరికాకు వెన్నులో చలిపుట్టించిన నాయకుడిగా క్యాస్ట్రో ఖ్యాతి గడించాడు. క్యూబా నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రోను హత్య చేసేందుకు అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ 638 సార్లు విఫలయత్నం చేసినట్లుగా కూడా వదంతులు ఉన్నాయి. అమెరికా ఆంక్షలను తట్టుకుని నిలబడిన దేశంగా క్యూబాను ఆయన తీర్చిదిద్దాడు.
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ చిన్న దేశం విజయం సాధించినా కూడా అది మన విజయమే అంటూ ఆయన క్యూబా ప్రజలకు నూరిపోసేవాడు. ప్రజలను ఉద్దీపింపజేసే పదునైన మాటలు, భావోద్వేగ ప్రసంగాలు చేయడంలో ఫిడెల్ క్యాస్ట్రో కు ఎంతో పేరుంది. త్వరలోనే ఆయన 90 సంవత్సరాల వయస్సును పూర్తిచేసుకోబోతున్నారు.
2016 ఏప్రిల్ 19న ఆయన చేసిన ప్రసంగం చారిత్రాత్మక మైనదిగా చివరి ప్రసంగంగా గుర్తింపు పొందింది. చేగువేరాకు అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడిగా కూడా ఫిడెల్ క్యాస్ట్రో కు గుర్తింపు ఉంది.

