కోరిన వారికి కోరినట్టుగా ఇచ్చేసిన కేసీఆర్

తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ మరోమారు తన ‘మార్కు’ ఏమిటో చూపించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి.. వేర్వేరు ప్రాంతాల్లో వ్యక్తమైన ప్రజాందోళనలను, డిమాండ్లను అన్నిటినీ ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. దేనినీ తోసిపుచ్చలేదు. ఎవ్వరూ బాధతో ఉండాల్సిన అవసరం లేదని విస్పష్టంగా ప్రకటిస్తూ.. ఉన్న అన్ని డిమాండ్లకు కార్యరూపం ఇస్తూ.. కొత్తగా మూడు జిల్లాలను కలిపారు. మొత్తం 30 జిల్లాలకు అనుకూలంగా తెలంగాణలో అధికార యంత్రాంగం కసరత్తు చేయాలని ఆయన సూచించారు. కేసీఆర్ ఫైనలైజ్ చేసిన మేరకు ఇదివరకు ప్రకటించిన 27 జిల్లాలకు అదనంగా గద్వాల, సిరిసిల్ల, జనగామ జిల్లాలు ఏర్పడబోతున్నాయి.
ఏయే జిల్లాల స్వరూపం ఎలా ఉండాలో.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డివిజన్లు మండలాల విషయంలో చిన్న చిన్న మార్పు చేర్పులు పూర్తిచేసి తదనుగుణమైన కసరత్తు చేయాలని కేసీఆర్ అధికార్లకు సూచించారు. దసరా రోజు నాటికి కొత్త జిల్లాలు ప్రారంభం అవుతాయని కేసీఆర్ చాలాకాలం కిందటే ప్రకటించిన నేపథ్యంలో.. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ‘‘దసరా రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో ఉంటే ఆ మూడు ప్రాంతాల వారు మాత్రం బాధతో ఉండడం ఇష్టం లేదు’’ అని పేర్కొనడం విశేషం. అచ్చంగా జనంలోని డిమాండ్లను పరిగణనలోకి తీసుకునే కొత్తగా మూడు జిల్లాలకు ఓకే చెప్పినట్లు ఆయన అన్యాపదేశంగా తేల్చేశారు.
అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరు పెట్టాలని కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాగా రూపొందబోతున్న సిరిసిల్లకు రాజన్న జిల్లాగా పేరు పెట్టే ప్రతిపాదన కూడా ఆయన చేశారు. ఒక్కొక్క జిల్లాలో సగటున 3 లక్షల కుటుంబాలు ఉండేలా ప్రణాళిక చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలు డివిజన్లు మండలాల సంఖ్య పెరిగినా పరవాలేదు అని, 30 జిల్లాలకు అనుకూలంగా కసరత్తు జరగాలి అని సూచించారు. రాబోయే 7, 8 ఏళ్ల కోసం అనుకూలంగా ప్రణాళికలు జరగాల్సి ఉందని ఆయన అధికార్లకు మార్గదర్శనం చేశారు.
2017 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం అని కూడా కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని మాట్లాడినట్లుగా 2018 చివరికెల్లా పూర్తిచేస్తాం అని కాకుండా కేసీఆర్ 2017 నాటికే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని కొత్తగా ఆయకట్టుకు నీళ్లందుతాయని చెప్పడం విశేషం.

