కోట్ల కరెన్సీ కట్టలు...టన్నుల కొద్దీ బంగారం..వజ్రాలు..!

కోట్ల రూపాయల నోట్ల కట్టలు... టన్నుల కొద్దీ బంగారం... ఐటీ అధికారులకు చూడగానే షాక్. ఇదీ తమిళనాడులో శశికళ బంధువుల ఇళ్లల్లో దాడుల సమయంలో వెల్లడయిన నిజాలు. కరెన్సీ కట్టలు.. కొత్త రెండు వేల రూపాయలు, ఐదొందలు నోట్లు... ఒకటి కాదు... రెండు కాదు... వందల సంఖ్యలో కట్టలు. బస్తాల్లో మూలుగుతున్నాయి. వీటి విలువ కొన్ని కోట్లలో ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కౌంటింగ్ మెషీన్లు తెప్పించి మరీ లెక్కలు వేస్తున్నారు. ఇది కొన్నిచోట మాత్రమే. ఇంకా కొడనాడ్ ఎస్టేట్ లో ఉన్న శశికళ, జయలలిత గదులను కూడా తెరిచారు. ఇందులో మరిన్ని కీలక ఆధారాలు, నోట్ల కట్టలు, బంగారం బయటపడే అవకాశముందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నమ్మ ఇంట్లో లెక్కిస్తున్న నోట్ల కట్టల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బంగారం, వజ్రాలు లెక్కేలేదు...
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ, ఆమె కుటుంబసభ్యుల నివాసాలపై వరుసగా ఆరు రోజుల పాటు ఐటీ శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం వెయ్యి మంది సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో ఏడు కోట్ల రూపాయల మేరకు నగదు, ఐదు కోట్ల రూపాయల విలువైన బంగారం ఉన్నట్లు తేలింది. ఇక చిన్నమ్మ ఇళ్లలో దొరికిన వజ్రాల విలువను లెక్కించేందుకు ప్రత్యేకంగా నిపుణులను తెప్పించాల్సి ఉంది. శశికళ, కుటుంబ సభ్యులకు చెందిన 16 బ్యాంక్ లాకర్లను సీజ్ చేశారు. అందులో ఏముందో చూడాల్సి ఉంది. శశికళ, దినకరన్, చిన్నమ్మ మేనల్లుడు, ఇళవరసి కుమారుడు వివేక్ ల ఇళ్లు, సంస్థలపైనే ఎక్కువగా ఐటీ శాఖ దాడులు జరిపింది. చివరకు చిన్నమ్మ జ్యోతిష్యుడిని కూడా వదలలేదు. అక్కడి కూడా కొన్ని కీలక డాక్యుమెంట్లను లభించాయి. శశికళ బంధువులకు సంబంధించిన పాస్ పోర్టులను కూడా సీజ్ చేశారు. మొత్తం మీద చిన్నమ్మ అక్రమార్జన మొత్తం బయటకు వస్తోంది. దాదాపు 1400 కోట్ల రూపాయల మేరకు ఆదాయపు పన్ను ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇది చిన్నమ్మకు కోలుకోలేని దెబ్బే.
- Tags
- శశికళ

