కొడుకు, మేనల్లుళ్ళపై కేసీఆర్ సొంత బాజా

సిరిసిల్ల, సిద్ధిపేట బహిరంగ సభలను కేసీఆర్ తన వారికోసం చక్కగా వాడుకున్నారు. సిరిసిల్ల సభలో తన కుమారుడు కేటీఆర్ పైనా, సిద్ధిపేట సభలో మేనల్లుడు హరీష్ రావు పై ప్రశంసలు కురిపించి డబ్బా కొట్టేశారు. కేటీఆర్ మంచి హుషారుగా ఉన్నాడని, ముందు జిల్లా ప్రకటిస్తే చాలని ఇచ్చాకా వందలకోట్ల నిధులు కావాలంటూ టెండర్ పెట్టాడని చమత్కరించారు. పైగా సిరిసిల్ల లో నువ్వు పెళ్లి కూడా చేసుకున్నావు అని కొడుకు గుర్తు చేసాడని మరీ చెప్పారు. మేనల్లుడు హరీష్ రావు పై అదే తీరులో సిద్ధిపేటలో చెప్పుకొచ్చారు . హరీష్ రావు హుషారు మీద వున్నారు అన్నారు .ఆయన జిల్లా ఇస్తే చాలన్నారు ఇప్పుడు చాలా అభివృద్హి పనులకు లిస్ట్ ఇచ్చారని కేసీఆర్ అన్నారు. గతంలో ఎన్టీఆర్ కు సిద్ధిపేట జిల్లా చేయాలని కోరినా పని జరగలేదన్నారు . ఇలా కొడుకు , అల్లుళ్ళ కు సీఎం మంచి మార్కులు జనంలో వేసి వారిద్దరిలో జోష్ పెంచారు కేసీఆర్.
దూకుడు పెంచిన కేసీఆర్ ....
ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా మీదపడొచ్చు అన్న అంచనాల్లో ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్ దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు సాగిస్తూ క్యాడర్ లో ఉత్సహం పెంచుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎక్కడ బలంగా వుంది , ఎక్కడ బలహీనంగా ఉందనే అంచనాలను స్వయంగా టి సీఎం దృష్టి పెడుతున్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏకరువు పెట్టడంతో బాటు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల చిట్టా ప్రకటించి జనాలను ఆశల పల్లకిలో ఊరేగిస్తున్నారు . తనదైన ప్రసంగాలతో ఆకట్టుకుంటూ విపక్షాలపై చెణుకులు విసురుతూ సింగరేణి ఎన్నికల విజయం తెచ్చిన ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ గులాబీ బాస్ ప్రజాయాత్రను ప్రారంభించడం కారు పార్టీలో స్పీడ్ పెంచింది .
- Tags
- కేసీఆర్

