కేసీఆర్‌కు పవన్... వెరీ.. వెరీ స్పెషల్..రీజన్ ఇదే!

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ అందరికన్నా ప్రత్యేకం! ఇది ఎవరో అన్నమాట కాదు.. తెలంగాణ సారధి సీఎం కేసీఆర్ అన్నట్టుగా ప్రచారంలో ఉన్న మాట. ప్రస్తుతం ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. పవన్ అంత స్పెషలా ఏంటి? అని నెటిజన్లు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు కూడా. రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే అంశంపై పెత్త ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో పవన్ చలోరే చలోరే చలో! యాత్ర చేశారు. కరీంనగర్లో ప్రారంభించిన ఈ యాత్ర మూడు రోజులు జరిగింది.
ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా...
అయితే, ఇక్కడే ప్రతిపక్షాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ప్రజల చేత, ప్రజల వలన ఎన్నుకోబడిన ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ తీస్తామన్నా, పాదయాత్ర చేస్తామన్నా.. బహిరంగ సభలు పెట్టుకుంటుమన్నా అనుమతించని ప్రభుత్వం ప్రజలతో ఒక్కసినీ హీరోగా తప్ప రాజకీయంగా ఎలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేని పవన్‌కు రోజుల తరబడి రోడ్డు షోలు, ప్రసంగాలకు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తారు. తెలంగాణాని వ్యతిరేకించిన పవన్ వస్తే రెడ్ కార్పేట్ పరుస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.
కోదండరామ్ కు నో ఎంట్రీ.....
ముఖ్యంగా రాష్ట్రంలో ఉద్యమంలో ప్రత్యేకంగా కనిపించి, మేదావులను ఐక్యవేదికపైకి తెచ్చిన ప్రొఫెసర్ కోదండరాంకు సైతం పాదయాత్ర చేసేందుకు పర్మిషన్ లేనప్పుడు పవన్‌కు కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడం వెనుక వేరే కారణం ఏముంటుంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు అనుకూలించకపోతే.. పవన్‌తో కలిసి వెళ్లాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యాడని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి.
పర్మిషన్ ఇలా లభించింది.....
పవన్ ఎలాగూ అధికారం కోరుకోవడం లేదు కాబట్టి.. తమకు మద్దతిస్తే..ఒకటి రెండు మంత్రి వర్గ సీట్లు, నామినేటెడ్ పదవులు ఇస్తే.. సరిపోతుందని, ఇది అన్ని విధాలా తమకు లబ్ధి చేకూరుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉద్యమ నేతలకు సైతం లభించని పర్మిషన్ కేసీఆర్ కనుసైగతో లభించిందని అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ దృష్టిలో పవన్ ఇప్పుడు.. ''గాడెవడు!'' కాదు.. వెరీ స్పెషల్ అని సెటైర్లతో కుమ్మేస్తున్నారు. నిజమే కదా?!!

