కేసీఆర్‌కు కోదండరాం స్కెచ్ అదిరిందే..!!

ఒకప్పుడు భుజం.. భుజం.. రాసుకుని తిరిగారు. ఇప్పుడు మాత్రం ఒకరంటే ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. వీరిద్దరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్, మేధావుల జేఏసీ ఛైర్మన్ కోదండరాంలు! ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానిస్తుండగా.. కేసీఆర్ కుటుంబ పాలన పరాకాష్టకు చేరుకుందని కోదండరాం విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంటోంది. ఇక, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోదండరాం హవాను తట్టుకునేందుకు కేసీఆర్ తన దైన వ్యూహంతో ముందుకు పోవాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఇదే సమయంలో కోదండరాం కూడా కేసీఆర్‌కు ఎర్త్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ హాట్‌గా మారింది.
కోదండరామ్ టార్గెట్ గా....
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఎవ్వరికి భయపడని కేసీఆర్ ఇప్పుడు కోదండరాంకు భయపడుతున్నారా ? అన్న చర్చలు, సందేహాలు కూడా స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు కేసీఆర్‌తో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అయిన కవిత, కేటీఆర్ నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వరకు అందరూ కోదండరాంను టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ చూస్తేనే కోదండం మాస్టారు టీఆర్ఎస్లో ఎలా గుబులు రేపుతున్నాడో ? అర్థమవుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. ఇటీవల కేసీఆర్ పాలనపై ధ్వజెమత్తుతున్న కోదండరాం.. ఎక్కడ కొడితే.. కేసీఆర్ కు ఇబ్బంది కలుగుతుందో అక్కడే కొట్టాలని డిసైడ్ అయ్యారు.
సిఎం సొంత ఇలాకాలో....
ఈ క్రమంలోనే ఆయన తన ఉద్యమాన్ని కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోను, తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోను కోదండరాం ఉద్యమాలకు సిద్ధమయ్యారు. ఫలితంగా కేసీఆర్ కంట్లోనే వేలు పెట్టినట్టు అవుతుందని కోదండరాం భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ టీజేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి నేరెళ్ల వరకు పాదయాత్ర చేపట్టారు. నేరెళ్లలో బహిరంగ సభ నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయలని కోరారు.
ఇసుక మాఫియాపై.....
నేరెళ్ల, కామారెడ్డి ఇసుక మాఫియా ఘటనపై సీఎం స్పందించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని జేఏసీ ఛైర్మన్ డిమాండ్ చేశారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విచ్ఛలవిడిగా వ్యవహరిస్తోందన్నారు. ఇసుక లారీలను తగలబెడితే ఊరుకుంటామా?అంటూ అధికారులు దబాయించడం కేసీఆర్ పాలనతీరుకు అద్దం పడుతోందని కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే న్యాయం అడిగిన ప్రజలపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేననా?, ప్రజాపాలన అంటే ప్రజలను పోలీసులతో కొట్టించడమేనా? అని ప్రశ్నించారు. మొత్తానికి ఈ పరిణామం.. కేసీఆర్‌కు కొత్త కుంపటి పెట్టేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

