కేసీఆర్ మీద ఎదురుదాడులకు దిగుతున్న కాంగ్రెస్

పీసీసీ చీఫ్ ను ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించడం, తాము చేసిన జిల్లాల విభజనను సమర్థించుకునే చర్యల్లో భాగంగా విపక్షాల అభ్యంతరాలను చాలా కేవలంగాచూడడం అనేది ఇప్పుడు పెద్ద రాద్ధాంతంగా మారుతోంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే కాదు. దాదాపుగా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కేసీఆర్ మీద ఎదురుదాడులకు దిగుతున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది కేసీఆరే అని ఒకరు కౌంటర్ ఇస్తే.. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలాగా తెలంగాణ ప్రజలు అంతా భావిస్తున్నారంటూ ఎడాపెడా విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రత్యర్థుల్ని తూర్పారపట్టడంలో కేసీఆర్ ది ప్రత్యేకమైన శైలి. అందులో భాగంగానే.. ఆయన తన జిల్లాల విభజన కసరత్తును తప్పు పడుతున్న కాంగ్రెస్ వారిని, ఇతర వామపక్షాల వారిని దారుణంగా విమర్శించారు. సీపీఎం వారికైతే అసలు తెలంగాణలో అడుగుపెట్టే అర్హతే లేదంటూ విరుచుకుపడ్డారు. విభజన కసరత్తు సమయంలో సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నందుకు ఆయన ఇలా అన్నారని అనుకోవచ్చు. సీపీఎం నాయకులు మహా పాదయాత్ర పేరుతో తెలంగాణలో ఎక్కడ పర్యటన చేసిన అడ్డుకోవాలని కూడా పిలుపు ఇచ్చారని పాఠకులకు తెలిసిందే. దమ్ముంటే కేసీఆర్ ప్రజల వద్దకు రావాలని, అక్కడే తేల్చుకుందాం అని పీసీసీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క కూడా దెప్పిపొడవడం విశేషం.
కేసీఆర్ విమర్శలపై ఇప్పుడు ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దేశంలో కేసీఆర్ వంటి సీఎం మరెక్కడా ఉండరని, ప్రజలను కలవని సీఎం ఆయన ఒక్కరేనని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అశాస్త్రీయంగా జరిగింది అనే మాటనే కాంగ్రెస్ వారు ఇప్పటికీ చెబుతున్నారు తప్ప.. శాస్త్రీయంగా అంటే ఎలా జరగాలో కనీస సూచనలు కూడా చేయకపోవడం గమనార్హం.

