కేసీఆర్ బడ్జెట్ ఎంతో తెలుసా?

ఎన్నికల బడ్జెట్ కు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ రెండు లక్షల కోట్లకు చేరనుంది. ఈ మేరకు కేసీఆర్ ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చేది ఎన్నికల బడ్జెట్ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈసారి తెలంగాణ బడ్జెట్ కు ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం మూడు బడ్జెట్ లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సాధారణ బడ్జెట్ తో పాటు, వ్యవసాయశాఖ బడ్జెట్ ప్రతి ఏటా ఉంటాయి. అయితే ఈసారి మహిళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఈసారి మూడు బడ్జెట్ లు....
2018-19 ఆర్థిక సంవత్సరానికి రూపొందిస్తున్న బడ్జెట్ లో టాప్ ప్రయారిటీ అంశాలను ఇప్పటికే గుర్తించింది. వ్యవసాయం, మహిళలు, బీసీ సంక్షేమంపైనే ఈ బడ్జెట్ లో ఎక్కువ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ప్రధానంగా బీసీలు, మహిళలను, రైతులను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. 2019 లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో కేసీఆర్ దగ్గరుండి బడ్జెట్ ను రూపొందించే పనిలో ఉన్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా బడ్జెట్ ఉండబోతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఈసారి తెలంగాణ సర్కార్ ప్రవేశ పెట్టనున్న మహిళ బడ్జెట్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ల, మహిళల రక్షణకు, ఆసరా పింఛన్లు వంటి వాటికి ప్రత్యేకంగా బడ్జెట్ ను కేటాయించనున్నారు.
రైతుల కోసం ప్రత్యేకంగా....
ఇక రైతులకు పెట్టుబడి పథకంతో పాటు నీటిపారుదల రంగానికి కూడా పెద్దపీట వేయనున్నారు. రైతలుకు రుణాలు, ఉచిత విద్యుత్తు, ఎరువుల పంపిణీ, ఎనిమిది వేల పెట్టుబడి కేటాయింపులు కూడా వ్యవసాయ బడ్జెట్ లో చేర్చనున్నారు. రైతు సమితుల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించే వీలుంది. రైతు సమన్వయ సమితుల ద్వారా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామని ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలన్నది రైతు సమితులే నిర్ణయిస్తాయి. డిమాండ్ ఉన్న పంటనే ఆ ప్రాంత ప్రజలు వేసేలా రైతు సమితులుచర్యలు తీసుకోనున్నాయి. దీంతో వ్యవసాయరంగానికి కూడా ఈసారి భారీగానే నిధులు కేటాయించనున్నారు. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అత్యధిక శాతం నిధులు కేటాయించనున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, డబుల్ బెడ్ రూమ్ పథకాలకు కూడా పుష్కలంగా నిధులు కేటాయించబోతున్నారు.
నూతన పంచాయతీరాజ్ చట్టం....
ఇక గ్రామ సర్పంచ్ లకు విస్తృత అధికారాలు కల్పించేలా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తేబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఏర్పాటయిన మంత్రి వర్గ ఉపసంఘం పలుమార్లు భేటీ అయి చర్చించింది. న్యాయపరమైన అంశాలపై అడ్వొకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డితో కూడా మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. పంచాయతీల్లోనూ కో- ఆప్షన్ సభ్యుడిని నియమించే అంశంపై చర్చిస్తున్నారు. ఈ నూతన చట్టం ప్రకారం సర్పంచ్ లకే అన్ని అధికారాలు ఉండేలా చూడాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. విధులు వారికే అప్పగించి నిధులు కూడా వారే ఖర్చు చేసుకునేలా నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల వరాలు ఎక్కువగానే ఉంటాయన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
.
- Tags
- తెలంగాణ బడ్జెట్

