కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు?

ఎమ్మెల్యే , కలెక్టర్ల మధ్య వివాదం ముగిసేట్లు లేదు. ఒకరిపై ఒకరు పంతానికి పోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విమర్శలకూ దిగుతున్నారు. ప్రభుత్వం, పార్టీ వీరి వివాదాన్నిపరిష్కరించే ప్రయత్నం చేయకపోవడంతో జనగామలో వీరి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకుమ్మ కుంట స్థలాన్ని ఆక్రమించారని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. బతుకుమ్మ కుంట స్థలంలో ఎమ్మెల్యే అక్రమ నిర్మాణాలుచేపట్టారని, దాన్ని నిషేధిత స్థలంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కాని అదే బతుకమ్మ కుంట స్థలంలో తన సొంత ఖర్చులతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బతుకమ్మ వేడుకలను నిర్వహించి కలెక్టర్ కు సవాల్ విసిరారు. దీంతో తన ఆదేశాలను ఎమ్మెల్యే ధిక్కరించారని కలెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బతుకమ్మ కుంట స్థలం ప్రభుత్వానికి చెందిందని, అక్కడ ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టొద్దని కలెక్టర్ శ్రీ దేవసేన ఆదేశాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బేఖాతరు చేయడంతో మరో వివాదం రాజుకుంది.
మళ్లీ తలెత్తిన వివాదం......
ఇప్పటికే కలెక్టర్ శ్రీదేవసేన పై ముత్తిరెడ్డ హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కు అందించారు. చీఫ్ సెక్రటరీ ఆర్పీసింగ్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కూడా మాట్లాడారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ కు చెప్పుకుందామనుకున్నా ఆయన అపాయింట్ మెంట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి లభించలేదు. అలాగే కలెక్టర్ ముత్తిరెడ్డిపై ఐఏఎస్ అధికారుల సంఘానికి, సీఎస్ కు ఫిర్యాదు చేశారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం వీరిద్దరి తగవును చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనక మతలబేంటన్నది అర్ధం కావడం లేదు. ముత్తిరెడ్డిపై చర్యకు దిగితే పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అలాగని కలెక్టర్ పై బదిలీ వేటు వేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని హైకమాండ్ భయపడుతుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. పార్టీ, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య వార్ మాత్రం ఆగలేదు. వీరిద్దరి వివాదానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో?

