కేసీఆర్ ఇక కన్నెర్ర చేస్తారా?

ఎన్నికలకు ముందు కేసీఆర్ పార్టీని కట్టడి చేయాలని చూస్తున్నారు. క్రమశిక్షణ తప్పుతున్న నేతలను పక్కనపెట్టకపోతే అసలుకే ప్రమాదం ఉందని గ్రహించిన కేసీఆర్ కన్నెర్ర చేస్తున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు, మంత్రులు పలు వివాదాల్లో చిక్కుకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. వార్నింగ్ లతో సరిపెట్టారు. ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, వీరేశం, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇలా నేతల వ్యవహరాన్ని చూసీ చూడనట్లు వదిలేశారు. ఇకపై పార్టీలో క్రమశిక్షణ తప్పదన్న వారిపై వేటు వేసేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీపై చర్యలు తీసుకునేందుకే కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందుకోసమే జిల్లా నేతల నుంచి సస్పెన్షన్ సిఫార్సును తెప్పించుకున్నారు. పార్టీయే ఆయనను సస్పెండ్ చేస్తుంది.
ఎమ్మెల్యేలను కూడా వదిలపెట్టేది లేదంటున్న...
తెలంగాణాలో రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నుంచి పెద్దయెత్తున నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఇంకా చేర్చుకుంటూనే ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు పెత్తనం చలయిస్తుండటం, వచ్చే ఎన్నికల్లో వీరి వల్ల తమకు సీటు దక్కుతుందో లేదో అన్న అనుమానం పట్టిపీడిస్తుండటంతో అనేక మంది ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చి చేరిన వారిని కలుపుకుని వెళ్లడం లేదు. వారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. దీంతో వారు ప్రత్యేకంగా ఒక గ్రూపును నియోజకవర్గంలో తయారు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో అనేక జిల్లాల్లో నాయకత్వ పోరు ప్రారంభమైంది. అలాగే ఎమ్మెల్యేలు భూవివాదాలు, అధికారులను బెదిరించడం వంటి వివాదాల్లో చిక్కుకోవడం కేసీఆర్ కు ఆగ్రహం తెప్పిస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఓపిక పట్టిన ఆయన ఇకపై ఉపేక్షించేది లేదని సంకేతాలు ఇవ్వడానికే ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యకు ఉపక్రమించినట్లు తెలిసింది. మరికొందరు ఎమ్మెల్యేలపైన కూడా వేటు వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనైనా గులాబీ నేతలు క్రమశిక్షణ తప్పరన్నది ఆయన ఆశ... ఆకాంక్ష. చూద్దాం... ఏం జరుగుతుందో....
- Tags
- కేసీఆర్

