కేజ్రీవాల్ మాటలే.. జనం మదిలో మెదలుతున్నాయ్

పెద్ద నోట్ల రద్దు ద్వారా జనానికి ఇబ్బందులు ఎదురవుతుండగా.. మోదీ ప్రయత్నాన్ని తొలిరోజునుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు మరో సారి.. తీవ్రస్థాయిలో ఈ ప్రయత్నాల మీద విరుచుకుపడ్డారు. మోదీ చేసిన హఠాత్ నిర్ణయం పెద్ద నోట్ల రద్దు అనేది బ్లాక్ మనీని ఇబ్బడి ముబ్బడిగా కలిగి ఉండే బడాబాబులకు ఏమాత్రం ఇబ్బంది కరంగా లేదని.. వారంతా తమ డబ్బును కాపాడుకోవడానికి తమవైన మార్గాలు ఎంచుకున్నారని, కానీ అనాలోచితంగా మోదీ సర్కారు చేస్తున్న చర్యల వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ తీవ్రమైన విమర్శలు రువ్వారు.
నిజానికి దేశవ్యాప్తంగా జనం మదిలో మెదలుతున్న సందేహాలనే కేజ్రీవాల్ ప్రతిబింబిస్తూ ఈ విమర్శలు చేస్తున్నారని అనిపిస్తోంది. కేజ్రీవాల్ చెబుతున్న ప్రకారం రెండు రోజులుగా బ్యాంకుల వద్ద క్యూల్లో గంటల తరబడి నిల్చుని కేవలం రెండువేల రూపాయలు నగదు మార్చుకుని కొత్తనోట్లు పుచ్చుకుని వెళుతున్న ప్రజలంతా సామాన్యులు, మధ్య తరగతి వారే తప్ప.. నల్లధనం కలిగి ఉండే బడాబాబులు కాదనేది కేజ్రీవాల్ మాట.
నిజానికి జనం అందరూ ఇదే అనుకుంటున్నారు. నల్లధనం కలిగి ఉండే బడాబాబుల్లో ఎలాంటి కదలిక వస్తున్నట్లు కనిపించడం లేదు. కొన్ని చోట్ల అయితే... బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కు అయి చాలా పెద్ద మొత్తాల్లో పాత నోట్లకు కొత్తనోట్లు తీసేసుకుంటున్నారని.. అందుకు బ్యాంకు సిబ్బందికి భారీ కమిషన్లు ముట్టజెబుతున్నారని.. అంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతునదని కూడా పుకార్లు వస్తున్నాయి. మరి జనం మదిలో మెదలుతున్న ఆలోచనలకు మోదీ సర్కారు చేతల రూపంలో ఎలాంటి సమధానం చెబుతుందో.

