కేజ్రీవాల్ చిక్కులు కొని తెచ్చుకుంటున్నారే

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయన నివాసంలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి అన్షు ప్రకాష్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ముఖ్యమంత్రి నివాసంలోనూ తనిఖీలు చేశారు. ఆయన నివాసంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అంతేకాదు దాడికి సంబంధించిన ఏదైనా ఆధారాలు దొరుకుతాయమోనని తమ ప్రయత్నాలు తాము చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే తన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించడంపై అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు....
తన ఇంట్లో సోదాలు చేయడం కాదని, దమ్ము... ధైర్యముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను జస్టిస్ లోయా కేసులో విచారించాలని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకుట్రతోనే అక్రమ కేసులు తమ పార్టీ ఎమ్మెల్యేలపై బనాయిస్తున్నారని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలం తమవైపే ఉందన్నారు అరవింద్ కేజ్రీవాల్. కాగా ముఖ్యమంత్రి నివాసంలో సోదాలు నిర్వహించడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా పరిగణించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సోదాలు, దాడులేంటని, తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు అశుతోష్, సంజయ్ సింగ్ లుఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. సోదాల్లో 70 మంది పోలీసులు పాల్గొనడం విశేషం.
కేజ్రీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన....
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీకే జైన్ సాక్ష్యం ఇప్పుడు బలంగా మారింది. వీకే జైన్ అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సంఘటన జరిగిన రోజున తాను బాత్ రూంలో ఉన్నానని ఆయన తొలుత చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం తాను బాత్ రూం నుంచి వచ్చేసరికి చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ పై కొందరు దాడి చేయడాన్ని తాను చూశానన్నారు. ఆయనపై ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ గడ్డం పట్టుకుని గట్టిగా నిలదీస్తున్న దృశ్యాన్ని తాను చూశానని పోలీసులకు చెప్పారు. ఈ సాక్ష్యాన్నే కీలకంగా తీసుకున్న పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. అయితే వీకే జైన్ పోలీసుల వత్తిడి మేరకే తప్పుడు సాక్ష్యం చెప్పారంటున్నారు ఆప్ నేతలు. మొత్తం మీద చీఫ్ సెక్రటరీ దాడి వ్యవహారం అరవింద్ కేజ్రీవాల్ కు తలనొప్పిగా మారింది.
మూడు రోజుల నుంచి పాలన లేక....
కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీ పై దాడిచేయడంతో మూడు రోజుల నుంచి ఢిల్లీలో పాలన సాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. దీంతో కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తో భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా కేజ్రీవాల్ టీమ్ ను లెఫ్ట్ నెంట్ గవర్నర్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో హింసకు తావుండదని, ప్రభుత్వ ఉద్యోగుల్లో అపనమ్మకాన్ని ప్రభుత్వమే తొలగించాలని బైజల్ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు విధులకు హాజరయ్యేలా చూస్తానని అనిల్ బైజల్ కేజ్రీవాల్ కు హామీ ఇచ్చారు. ఢిల్లీ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు. మొత్తం మీద ఈ వివాదానికి తెరపడి అధికారులకు విధులకు హాజరవుతారని ఆశిద్దాం.
- Tags
- కేజ్రీవాల్

