కేంద్రంతో ఇక అమితుమీ

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కేసీఆర్ ఆక్షేపణ తెలియజేశారు. విభజన హామీలు అమలుపర్చకుండా, ఎలాంటి ప్రోత్సాహాలను ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన గవర్నర్ ఎదుట ఎండగట్టారు. గవర్నర్ నరసింహన్ తో రెండు గంటల పాటు భేటీ అయిన కేసీఆర్ కేంద్రం ప్రభుత్వంపై మండిపడినట్లు తెలుస్తోంది.
పేద రాష్ట్రాల సంగతేంటి?
కేంద్రం రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్ష కారణంగానే తాను జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు కేసీఆర్ గవర్నర్ కు వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి మార్పు రాకపోవడంపై ఆయన ఆవేదన చెందారు. ఇంకా దేశ పరిస్థితి పునాది దశలోనే ఉండటం పట్ల ఆందోళన చెందారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం సమృద్ధిని సాధిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందడం లేదని ఆయన తీవ్రంగానే ఆరోపించారు.
పట్టించుకోరా?
ఆదాయమున్న తెలంగాణ రాష్ట్రాల పరిస్థతే ఇలా ఉంటే పేద రాష్ట్రాల పరిస్థితి ఏంటని కేసీఆర్ గవర్నర్ ను ప్రశ్నించారు. రాష్ట్రాల గోడును వినే ఓపిక కూడా కేంద్రానికి లేదన్నారు. ఇక్కడకు వచ్చి ప్రధానితో సహా కేంద్రమంత్రులందరూ పొగిడి వెళతారని, తీరా సాయం అందించమంటే మాత్రం చేతులు రావని కేసీఆర్ ఆవేదన చెందారు. గవర్నర్ గా రెండు రాష్ట్రాల బాధలను, సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ గవర్నర్ ను కోరారు. తనది థిక్కారస్వరం కాదని ఆవేదన మాత్రమేనని, ఢిల్లీ వేదికగా తన వాయిస్ ను విన్పిస్తానని కేసీఆర్ చెప్పారు. మొత్తం మీద కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచనలను కూడా గవర్నర్ తో పంచుకున్నారు.
- Tags
- కేసీఆర్
