కేంద్రం దాదాపుగా చేతులెత్తేసినట్లే

ఏపీ విభజన హామీల అమలుకు కేంద్రం సానుకూలంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆయన తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడారు. తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నానని, కాని చట్టంలో సక్రమంగా పెట్టనందున తామేమీ చేయలేమని బీజేపీ చెబుతుందన్నారు. అయితే కసిగా పోరాడి హామీలను సాధించుకోవాల్సిందేనని చంద్రబాబు చెప్పారు. బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చని భావించానని, అయితే బీజేపీ ఇప్పుడు హామీల అమలుకు సానుకూలంగా లేదని సంకేతాలు అందుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలదే పాపం....
ఆరోజు రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. రెండు జాతీయ పార్టీలూ కలిసే రాష్ట్రాన్ని విభజించాయని, బిల్లు పాస్ చేశాయని చెప్పారు. ఏడు మండలాలను ఏపీలో కలపకుంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చెప్పబట్టే అవి కూడా వచ్చాయన్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోని ఏ పార్టీ అయినా వ్యతిరేకతను ఎదుర్కొనాల్సిందేనన్నారు. విభజించిన కాంగ్రెస్ పార్టీ దుస్థితిని చూసైనా బీజేపీ నేర్చుకోవాలన్నారు చంద్రబాబు. అయితే విభజన హామీల అమలుకోసం తుదికంటా పోరాడాల్సిందేనన్నారు.
వాస్తవ పరిస్థితులు వివరించాలి....
ప్రజల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను వివరించాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఆదేశించారు. విభజనచట్టంలో ఏమున్నాయి? రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చింది అనే అంశాలు ప్రజలకు తెలియజెప్పాలన్నారు. హామీలు అమలు జరుగుతాయోమనని నాలుగేళ్లుగా ఆశతో ఎదురుచూశానని, అయితే చివరి ఏడాది కూడా అమలు చేయకుంటే పోరాటం కాక ఏం చేస్తామని ప్రశ్నించారు. మన ఎంపీలు ఢిల్లీలో గట్టిగా పోరాడుతున్నారన్నారు. తాను పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తీసుకున్న విషయంపై కొందరు తప్పుపడుతున్నారని, అయితే నీతి అయోగ్ సూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు బాధ్యత చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అయితే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందని నీతి అయోగ్ చెప్పిందన్నారు.
సరైన సమయంలో సరైన నిర్ణయం....
పార్లమెంటు సమావేశాల్లో తమ నిరసనలు కొనసాగుతాయన్న చంద్రబాబు రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకోవాలో తాను ఎప్పటికప్పడు సమీక్షిస్తూనే ఉన్నానన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఫైలుపై తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. విభజన హామీల అమలుకోసం తాను 29 సార్లు ఢిల్లీ వెళ్లానని, ప్రధానిని కలిసి వాస్తవ పరిస్థితులు చెప్పానని, అయినా కేంద్రం సహకరించడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఏపీ సీఎం మాటలను చూస్తుంటే బీజేపీతో తెగదెంపులకే సిద్ధమయినట్లు కన్పిస్తోంది.
- Tags
- చంద్రబాబు
