కేంద్రం తీవ్ర నిర్ణయం : పాక్ సరిహద్దు మూత!

పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో భారత్ తీవ్రమైన నిర్ణయానికి వచ్చింది. సంబంధాలను తెగతెంపులు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. పాకిస్తాన్ తో సరిహద్దును పూర్తిగా మూసివేయబోతున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. 2018 డిసెంబరు నుంచి ఇది మూసివేయబోతున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ సంబంధాల ద్రుష్ట్యా ఇదేమీ చిన్న విషయం కాదు. పాకిస్తాన్ తో సరిహద్దు మూతకు నిర్ణయం తీసుకోవడం అంటే.. ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తుంచేసుకోవడమే. గతంలో వచ్చిన భాజపా సర్కార్ వాజపేయి నేత్రుత్వంలో పాక్ కు బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి మోదీ సర్కార్ ఏకంగా సరిహద్దులను మూసివేసే పరిస్థితి దాపురించింది.
భారత్ తో సంబంధాలు పూర్తిగా తెగిపోతే గనుక.. పాకిస్తాన్ కు వేర్వేరు కోణాల్లోంచి చాలా రకాల ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ వ్యాపారం, వనరులు ఇతరత్రా అనేక రంగాల పరంగా భారత్ మీద ఆధారపడి ఉందన్నమాట వాస్తవం సరిహద్దులు మూసివేయడం వంటి తీవ్ర నిర్ణయానికి మనదేశం వెళితే.. వారికి చాలా ఇక్కట్లు తప్పకపోవచ్చు.

