కుట్ర గోల జనం పట్టించుకోవడం లేదా ...?

తెలుగుదేశం పార్టీమీద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాలి. బిజెపి ద్రోహం చేసింది. వైసిపి, జనసేన కేంద్రం కుట్రలో భాగస్వాములు. టిడిపికి 25 ఎంపీ సీట్లు కట్టబెట్టండి కేంద్రంలో 2019 తరువాత చక్రం తిప్పుతాం. ప్రధానమంత్రిని డిసైడ్ చేసేది తెలుగుదేశమే. ఈ స్లొగన్స్ ప్రధానంగా పెట్టుకుని చంద్రబాబు తన ధర్మ పోరాట సభలు మొదలు పెట్టారు. బిజెపి, వైసిపి, జనసేన టార్గెట్ గా ఆయన ధర్మ పోరాట సభలు సాగిపోతున్నాయి. అన్ని సభల్లో కుట్ర అంశాన్నే బాబు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే టిడిపి ని భయపెట్టాలని కేంద్రం చూస్తుందని తాము దేనికి భయపడం అంటూ పదేపదే చెప్పుకొస్తున్నారు. అలాగే టిడిపికి రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది రక్షణగా ఉండాలంటున్నారు. ఇలా అయోమయం గందరగోళ రాజకీయానికి తెరలేపారు తెలుగుదేశం అధినేత. ఇందులో ఎన్ని వాస్తవాలు అవాస్తవాలు వున్నా ప్రజలు ఈ తరహా రాజకీయంపై పెదవి విరుస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

దృష్టి మరల్చడానికేనా ...?
రాష్ట్రంలో అనేక సమస్యలు ఎక్కడివి అక్కడే వున్నాయి. అమరావతి పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణం పై ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పోయారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం లక్ష్యంగా కులాలవారి కార్పొరేషన్ లు, ఎస్సి ఎస్టీ లకు రుణాలు ఇలా వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చే వాటికే బాబు సర్కార్ ప్రాధాన్యత ఇచ్చింది. కానీ మౌలిక వసతుల అంశంలో కానీ రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు, రేషన్ పంపిణి అవినీతి అంశాల్లో ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనికి తోడు పవన్ పార్టీ ఈసారి ఆయన తో విడిపడిపోవడం అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధపడుతూ ఉండటంతో చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రాన్ని కుట్ర కుట్ర అంటూ జనంలో అయోమయానికి ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో 2004 లో అలిపిరి లో నక్సల్స్ దాడి సెంటిమెంట్ తో తిరిగి గెలవాలని బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లి చేసిన ప్రయత్నం వికటించింది. 2014 లో రాష్ట్ర విభజన బిజెపి, జనసేన కలయిక ఆయన గెలుపును నల్లేరుపై బండి నడకగా చేశాయి. కానీ ఈసారి పరిస్థితులన్నీ ప్రతికూలంగా వున్న నేపథ్యంలో చంద్రబాబు ఏటికి ఎదురీదే ప్రయత్నం ఈమేరకు ఫలిస్తుందో చూడాలి.
