కుఛ్ కాలా హై : ప్రతివాళ్లూ జైట్లీని నిందించే వాళ్లే!

నిప్పులేనిదే పొగరాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నప్పుడు, అలాగే ‘అసమర్థత లేకుండా ఆరోపణలు కూడా రావు.’ అనే సిద్ధాంతంలో కూడా ఎంతో కొంత నిజం ఉందని అనుకోవాలి. దేశవ్యాప్తంగా జనావళిని నోట్ల రద్దు కష్టాలు కుదిపేస్తున్న తరుణంలో ఈ పరిస్థితులను విశ్లేషిస్తున్న ప్రతివాళ్లూ పార్టీలతో నిమిత్తం లేకుండా ఆర్థిక మంత్రి జైట్లీని నిందిస్తున్నారు. ఆయన అసమర్థత కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చిందని అంతా అంటున్నారు.
విపక్షాలకు చెందిన నాయకులు ఏకంగా మోదీ సర్కారు మొత్తానికి వైఫల్యాల్ని అంటగట్టి ఆడిపోసుకుంటూ ఉండడం సహజంగానే జరుగుతోంది. వీటన్నింటినీ ఒక స్థాయి వరకు రాజకీయవిమర్శలుగా పరిగణించవచ్చు.. కానీ ఆ మిష మీద ఆ విమర్శల్లో ఏ కొంత సహేతుకత ఉన్నా పూర్తిగా విస్మరించడానికి వీల్లేదు. పైగా ‘పదుగురాడుమాట పాడియై ధరజెల్లు’ అనే నానుడి మనకు ఉండనే ఉంది. దానిని బట్టి చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా జైట్లీ అసమర్థతనే నిందిస్తున్నారు.
నోట్ల రద్దు అనే నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు కూడా.. దాని పర్యవసానంగా వచ్చే కష్టాలను సరిగ్గా అంచనా వేయలేక, తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోకుండానే ప్రజల్ని ఇన్ని రకాల యాతనలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు కొందరు, రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు కూడా.. ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు చూసే అలవాటులేని, ప్రజల్లోంచి గెలవని నాయకుల సలహాలు తీసుకున్నంత కాలం మోదీకి కూడా చేటు తప్పదని అంటూ ఇండైరక్టుగా జైట్లీనే ఉద్దేశించి విమర్శలు చేస్తుండడం జరుగుతోంది.
అయితే ఇలాంటి నర్మగర్భంగా.. ప్రజల్లోంచి గెలవని వాళ్ల నిర్ణయాల వల్లే ఇలా నాశనం అవుతునదని అనే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. కాకపోతే.. భాజపా సీనియర్ నాయకుడు, మేధావిగా గుర్తింపు ఉన్న సుబ్రమణ్య స్వామి మాత్రం.. అరుణ్ జైట్లీ అసమర్థతను ఇంకాస్త హైరేంజిలో దుమ్మెత్తిపోస్తున్నారు. మనదేశానికి ఆర్థికమంత్రిగా సరైన ఆర్థికవేత్తలు ఉండాలే తప్ప.. 2+2=4 అని చెప్పేవాళ్లు అవసరం లేదంటూ జైట్లీ గురించి ఎద్దేవా చేస్తున్నారు.
ప్రత్యేకించి తన అసమర్థత చుట్టూతా ఇన్ని రకాల విమర్శలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. అరుణ్ జైట్లీ ఈ పాతిక రోజుల్లో ఇప్పటిదాకా కనీసం ఒక్కమాట కూడా కనీసం కష్టాలు పడుతున్న ప్రజల గురించి సానుభూతిగా కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఆయన మాత్రం ఇప్పటికీ.. మాయమాటలతో అంతా బాగానే ఉన్నదని జనాన్ని బురిడీ కొట్టించే మాటలే చెబుతున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు 120 శాతం పెరిగిపోయాయి. మరికొన్ని రోజుల్లో అందరికీ అలవాటు అయిపోతుంది... నగదు కోసం కష్టాలు తగ్గిపోయాయి.. అంటూ ఏసీ రూముల్లో కూర్చుని ప్రాక్టికాలిటీ తెలియని డైలాగుల్ని వల్లిస్తున్నారు. అసలే కష్టాలు పడుతున్న ప్రజలకు ఇలాంటి మాటలు పుండుమీద కారం రాసినట్లుగా ఉంటాయనడంలో సందేహం లేదు.

