కుంతియా...ఎదుట కుప్పిగంతులా..?

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు మళ్లీ షురూ అవుతున్నట్లున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలకు తెరలేపుతుంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలతో పార్టీ హైకమాండ్ కూడా అప్రమత్తమయింది. బుధవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా హైదరాబాద్ కు వచ్చారు. గాంధీ భవన్ లో సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వన్ టు వన్ భేటీల్లో కాంగ్రెస్ నేతలు వారి అభిప్రాయాలను కుంతియా ముందు కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. పార్టీ ఇలాగే వెళితే మరోసారి ఓటమిని చవిచూడాల్సి ఉంటుందన్న కూడా కొందరు నేతలు హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. కుంతియా విడివిడిగా సమావేశమయింది వారి మనసులో ఉన్నది తెలుసుకోవడానికే.
కోమటిరెడ్డి సీరియస్ గానే...
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుంతియాతో విడిగా భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితులను చర్చించారు. తనకు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగిస్తే తాను తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చురుకుదనం లేదని, మరింత దూకుడుగా వెళితేనే కేసీఆర్ ను ఢీకొనగలమని కోమటిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు సీనియర్ నేతలతోనూ కుంతియా సమావేశమయ్యారు. కొత్తగా పార్టీలో చేరిన వారి పరిస్థితిపై కుంతియా ఆరా తీసినట్లు తెలిసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత కొంత పుంజుకుందని కొందరు నేతలు చెప్పగా, హడావిడి తప్ప రేవంత్ వల్ల ఒరిగేదేమీ లేదని మరికొందరు నేతలు కుంతియా ఎదుట చెప్పారు.
ఉత్తమ్ పనితీరుపైనా...
ఇక పీసీసీ అధ్యక్షుడు పనితీరుపై కూడా కొందరు నేతలు కుంతియాకు ఫిర్యాదు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్ష ధోరణిని వ్యవహరిస్తున్నారని, తీసుకున్న నిర్ణయాలను కనీసం సమాచారం అందించడం లేదని కొందరు ఆరోపించారు. ఇటీవల గవర్నర్ రాజభవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని అందరికీ చేరవేయకపోవడంతోనే నాగం దాగేందర్, రాపోలు ఆనందభాస్కర్ వంటి నేతలు అక్కడకు వెళ్లారని, ఇది మంచి పద్ధతి కాదని కొందరు నేతలు కుంతియాకు ఫిర్యాదు చేశారు.
కుంతియాను కలిసేందుకు...
ఇక కుంతియాను కలిసేందుకు బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి వస్తారన్న ప్రచారం జరిగింది. నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. నాగం కూడా బీజేపీ పట్ల విసిగిపోవడంతో ఆయన కుంతియాను కలవనున్నారని తెలిసింది. అలాగే టీడీపీ నేత పెద్దిరెడ్డి కూడా కుంతియాను కలిసేందుకు వస్తారని గాంధీభవన్ లో ప్రచారం జరిగింది. పెద్దిరెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే నాగం రాకను డీకే అరుణ లాంటి నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కుంతియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తినెలకొంది. మొత్తం మీద గాంధీభవన్ కుంతియా రాకతో కళకళలాడిపోతోంది. అయితే కుంతియా అందరికీ ఓపిగ్గా సమాధానమిస్తూ నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నంచేశారు. అంతేకాదు పీసీసీ నాయకత్వం గురించి తాను చూసుకుంటానని కొంత ఘాటుగానే నేతలకు చెప్పినట్లు తెలిసింది.
- Tags
- కుంతియా

