కిషన్‌కు కంఠశోష తప్ప ఫలముంటుందా?

కేంద్రంలో అడపాదడపా తమ సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదనే సానుభూతి ఎంతమాత్రమూ లేకుండా.. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో, విమర్శలు గుప్పించడంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తన పని తాను చేసుకుపోతోంది. కేసీఆర్ మీద దూకుడుగా పోరాడడానికే నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకపోతే కేసీఆర్ ఎదుట ఎంత పోరాడినా సరే.. ఆ పోరాటాలకు ఫలితం దక్కుతుందా .. ఆయన సాధారణంగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తారు కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త జిల్లాలకు పేర్లు పెట్టే విషయంలో మజ్లిస్ మరియు ఒవైసీ ఒత్తడికి కేసీఆర్ తలొగ్గుతున్నారని విమర్శించారు. కేవలం ఒవైసీ ఒత్తిడికి తలొగ్గే వికారాబాద్ జిల్లాకు అనంతగిరి అని పేరు పెట్టలేకపోయారంటూ కిషన్ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ జిల్లాకు కూడా భాగ్యనగరం అని పేరు పెట్టి ఉండాల్సిందన్నారు.
వికారాబాద్ జిల్లా విషయంలో తెలుగుపోస్ట్ డాట్ కామ్ ఇదివరకే ఓ కథనాన్ని కూడా అందించింది. అక్టోబరు 5న ‘ఒవైసీ ఒత్తిడికి కేసీఆర్ తలొగ్గుతారా? లేదా?’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో.. ఇదే అంశం చర్చించడం జరిగింది. నిజానికి అనంతగిరి జిల్లా అని నామకరణం చేయాలన్నది కేసీఆర్ మదిలో పుట్టిన కోరికే అయినప్పటికీ.. దాన్ని కూడా ఆయన కార్యరూపంలో పెట్టలేకపోయారు. ఎందుకంటే దాని పేరును వికారాబాద్ జిల్లాగానే ఉంచాలంటూ ఒవైసీ లేఖ ద్వారా కేసీఆర్ ను కోరడమే కారణం. కేసీఆర్ సహజంగానే ఆ మాట మీరలేకపోయారు.
ఒవైసీ బ్రదర్స్ ఎంత చెబితే అంతే అన్నట్లుగా కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప.. వారి మనోగతానికి భిన్నంగా వ్యవహరించబోరని గతంలో చాలా సార్లు నిరూపణ అయింది. అలాంటి నేపథ్యంలో వికారాబాద్ తో పాటు, ఏకంగా హైదరాబాద్ జిల్లా పేరు కూడా మార్చాలంటూ నినదించడం, బీసీ కమిషన్ ఏర్పాటు ప్రయత్నమే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చేస్తున్నకుట్ర అంటూ ఆరోపించడం వల్ల కిషన్ రెడ్డికి కంఠశోష తప్ప.. మరో ప్రయోజనం దక్కకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు.

