కాసేపట్లో తేల్చిపారేయనున్న చంద్రబాబు...!

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో కర్నూలు స్థానిక సంస్థల ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఈరోజు అభ్యర్థిని చంద్రబాబు ఖరారు చేయనున్నారు. నిన్న కర్నూలు జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు ఆశావహుల పేర్లను చదివి వినిపించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
సమావేశానికి బుట్టా రేణుక....
చంద్రబాబు ఒక్కొక్కరితో సమావేశమై ఎవరికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందో అడిగి తెలుసుకున్నారు. సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందో నేతలతో విడివిడిగా చర్చించారు. కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో పాటు ఇటీవల టీడీపీకి మద్దతు పలికిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీకి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి పార్టీ సమావేశంలో రేణుక పాల్గొన్నారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి 270 ఓట్ల ఆధిక్యత ఇప్పటికే ఉంది. దీంతో గెలుపు గ్యారంటీ కావడంతో ఆశావహుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
ఎవరికి ఇవ్వాలి...?
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం కేఈ ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, విష్ణువర్థన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ సీటును నంద్యాల పార్లమెంటు పరిధిలోని వారికే ఇస్తూ వస్తున్నారు. ఈసారి కర్నూలు పార్లమెంటు పరిధిలోని నేతలకు ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకూ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తూ వచ్చారని, ఈసారి బీసీలకు కేటాయించాలన్న నినాదం కూడా ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11గంటలకు ఆశావహులతోనూ విడివిడిగా చంద్రబాబు సమావేశమయి అభ్యర్థి ఎవరో నిర్ణయించనున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో తేలనుంది.
- Tags
- చంద్రబాబు

