కావేరి....రగడ చల్లారుతుందా?

తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన కావేరి జల వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దశాబ్దాలుగా కావేరీ జల వివాదం రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే. కావేరి జల వివాదాలకోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ మాటను సయితం రాష్ట్రాలు బేఖాతరు చేయకపోవడం, ఆందోళనలు ప్రారంభమవ్వడంతో అన్ని రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తమిళనాడుకు 177.25 టీఎంసీలు, కర్ణాటకకు 284.75 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పాండిచ్చేరికి 7 టీఎంసీల నీటిని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కావేరి నదిపై ఏ రాష్ట్రానికి పూర్తి హక్కులు లేవని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
సుప్రీం తీర్పుతోనైనా.....
కొన్ని దశాబ్దాల నుంచి ప్రధానంగా కర్ణాటక, తమిళనాడుల మధ్య వార్ నడుస్తుంది. కావేరి జలాల పంపిణీలో అన్యాయం జరుగుతుందంటూ తమిళనాడులో అనేకసార్లు ఆందోళనలు జరిగాయి. దీంతో 1990లో కావేరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేశారు. కావేరి నదిలో నీటి లభ్యత ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీళ్లు కేటాయించాలో ట్రిబ్యునల్ అధ్యయనం చేసి మరీ స్పష్టం చేసింది. 2016లో తమిళనాడులో నీటి సమస్య తలెత్తడంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు పదిహేను వేలక్యూసెక్కుల నీటిని పది రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటకకు సుప్రీంకోర్టు ఆదేశింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం మళ్లీ రాజుకుంది. ఇలా కావేరి జలాలు రెండు రాష్ట్రాల మధ్య అనేకసార్లు యుద్ధవాతావరణాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో వివాదం సద్దుమణిగే అవకాశముంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కర్ణాటకకు గతంలో కంటే అదనంగా 14.5 టీఎంసీల నీరు లభించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడుకు కర్ణాటక బస్సులను రద్దు చేశారు. అలాగే తమిళనాడు సర్వీసులను కూడా కర్ణాటకకు నిలిపివేశారు. రెండు రాష్ట్రాల్లో పెద్దయెత్తున పోలీసు బలగాలు మొహరించాయి.
- Tags
- కావేరి

