కావేరి...కమల్...ఏందిది?

కావేరి జలాలపై సుప్రీంకోర్టు తీర్పును తమిళనాట అన్ని పార్టీలూ దాదాపుగా పెదవి విరుస్తున్నాయి. కావేరీ జలాల విషయంలో హక్కులను కోల్పోతున్నామని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ పేర్కొన్నారు.న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా తమ వాదనలు విన్పించక పోవడం వల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తమిళనాట శాఖలు కూడా తీర్పుపై నిరాశ చెందాయి. తీర్పు తమను ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నాయి. తక్షణం సుప్రీంకోర్టు తీర్పుపై అఖిలపక్షాన్ని ఏర్పాుటు చేయాలని తమిళనాట అనేక పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాజకీయం చేయొద్దంటూ....
అయితే త్వరలో పార్టీని ప్రకటించబోతున్న కమల్ హాసన్ మాత్రం స్పందన వేరేగా ఉంది. తమిళనాడుకు నీటికేటాయింపులు తగ్గించడం తనకు దిగ్భ్రాంతికి గురి చేసిందని, అయితే నదిపై ఎవరికీ యాజమాన్య హక్కులు లేవని చెప్పడం సంతృప్తి నిచ్చిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని, తమిళనాడుకు కేటాయించిన నీటిని సమర్థవంతగా వాడుకోవాలని ఆయన సూచించారు. అయితే కమల్ వ్యాఖ్యలపై తమిళనాడులో అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీటి కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగితే రాజకీయం చేయొద్దని కమల్ చెప్పడం విచిత్రంగా ఉందని కొందరు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
ఈ నెల 21 వ తేదీన ....
అయితే కమల్ హాసన్ ఈ నెల 21వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. అదే రోజు ఆయన పార్టీ పేరు, విధివిధానాలను ప్రకటించనున్నారు. అయితే ఆయన తన పార్టీ రైతన్నల కోసమే పెడుతున్నట్లు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తమిళనాడులో సేద్యం పూర్తిగా సంక్షోభంలో ఉందని కమల్ చెబుతున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదని, రైతులకు ఆత్మహత్యల తప్ప మరో మార్గం లేదని ఆయన ఆవేదన చెందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. అందుకే రైతుల పక్షానే పార్టీ నిలబడుతుందని కమల్ ప్రకటించారు. మరోవైపు కావేరి జలాల విషయంలో రాజకీయం వద్దని సూచించడం కమల్ అవగాహన లేమికి కారణమంటున్నారు తమిళ తంబీలు. మొత్తం మీద కమల్ పార్టీ పెట్టక ముందే వివాదాల్లో చిక్కుకుంటున్నారన్నమాట.
- Tags
- కమల్ హాసన్

