‘కాలుష్యాన్ని సహించను’ అంటున్న సీఎం చంద్రబాబు

భీమవరం వద్ద ఆక్వా పార్క్ ఏర్పాటు వివాదంగా మారుతున్న నేపథ్యంలో, కాలుష్యం అనేది ప్రధాన సమస్యగా తెరమీదకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా వ్యవహారాల్ని సమీక్షించి ప్రజలకు అనేక రకాలుగా భరోసా అందించే ప్రయత్నం చేశారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయ పార్టీలకు బ్రేకులు వేసే ప్రయత్నం కూడా చేశారు.
రాష్ట్రాన్ని పారిశ్రామిక వ్యర్ధాలు, కాలుష్య రహితంగా చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అన్ని పారిశ్రామికవాడల్లోనూ కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)లను నెలకొల్పి అంతర్జాతీయ స్థాయిలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటించేలా చూడాలని పీసీబీకి స్పష్టం చేశారు. ఓడీఎఫ్‌లో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినట్టుగానే కాలుష్య నియంత్రణలోనూ ముందుండేలా చేస్తామని చెప్పారు.
భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఫుడ్ పార్క్‌పై వ్యక్తమవుతున్న ప్రజాందోళన దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదివారం అమరావతిలోని తన నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. తనకు సంపూర్ణ మద్దతిచ్చి, అండగా నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని, జిల్లా అభివృద్ధికి సర్వదా కట్టుబడి వుంటానని ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ముందున్న పశ్చిమగోదావరి జిల్లాను పారిశ్రామికంగానూ ఉన్నత స్థానంలో నిలపాలన్నదే తన ఆశయమని, అందుకే పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నట్టు చెప్పారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ కాలుష్యకారకం కాదని, కాలుష్యం కలిగించేదిగా వుంటే అనుమతులు ఇచ్చే పరిస్థితి తలెత్తదని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యర్ధాల్ని శుద్ధి చేసి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా సముద్రంలో కలిసేలా చేస్తామన్నారు.
మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే పరిశ్రమ యాజమాన్యం రూ. 25 కోట్ల వరకు ఖర్చు చేసినందున మరో ప్రాంతానికి తరలించడం సాధ్యం కాదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే కాలుష్య నియంత్రణపై పరిశ్రమ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినా, అలసత్వం ప్రదర్శించినా చర్యలకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు సీఈటీపీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో నీటిని శుద్ధి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో కాలుష్యంబారిన పడిన అన్ని కాలువలను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని సూచించారు.
మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతో పాటు మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌పై అపోహలు తొలగించాల్సిందిగా కమిటీకి చెప్పారు. పరిశ్రమలతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, వేగంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ తప్పదనే విషయాన్ని నచ్చజెప్పాలని సూచించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా 35 వేల ఎకరాలు ఇచ్చినా, మచిలీపట్నం పోర్టుకు భూములిచ్చినా అది ప్రభుత్వంపై వున్న నమ్మకంతోనే సాధ్యమైందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయనని చెప్పారు. ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా శాంతియుత వాతావరణం భగ్నం కాకుండా చూసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదేనని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సానుకూల దృక్పధంతో వుంటారని, అలాంటి ప్రశాంతమైన జిల్లాలో కొన్ని స్వార్ధశక్తులు అలజడి సృష్టించాలని ప్రయత్నించడం దారుణమని ముఖ్యమంత్రి అన్నారు. అసత్యాలు చెప్పి ప్రజలను రెచ్చగొడితే చూస్తే సహించేది లేదన్నారు. దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు.

