కార్తీ అరెస్ట్ వెనక?

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడికి ఎంత దురవస్థ పట్టింది? ఆయన విలాసవంతమైన జీవితానికి తెరదించేశారు సీబీఐ పోలీసులు. ఇప్పుడు జాతీయ మీడియాలో ఇవే కథనాలు వస్తున్నాయి. కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేసి చెన్నై నుంచి ఢిల్లీకి తీసుకెళుతుండగా తనను బిజినెస్ క్లాస్ లో తీసుకెళ్లాలని కార్తీ గోలగోల చేశారట. అయితే ఇందుకు సీబీఐ అధికారులు మాత్రం నిబంధనలు అంగీకరించబోవని, ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే తనకు బిజినెస్ క్లాస్ లోనే ప్రయాణించేలా చూడాలని కార్తీ వత్తిడి తెచ్చినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదు.
కార్తీకి అగచాట్లు....
కార్తీ చిదంబరం తరచూ విమానయానం చేస్తూనే ఉంటారు. ఆయన బిజినెస్ క్లాస్ లోనే వెళతారు. చివరకు అరెస్ట్ అయి ఎకానమీ క్లాస్ లో వెళ్లాల్సి వచ్చింది. ఇక బుధవారం కార్తీని అరెస్ట్ చేయగా ఆ రాత్రి, గురువారం ఉదయం కూడా తనకు నాణ్యత కలిగిన భోజనం అందించలేదని కార్తీ ఆరోపిస్తున్నారు. నాసిరకమైన భోజనాన్ని తనకు పెట్టారని ఆయన వాపోతున్నారు. ప్రస్తుతం కార్తీని పటియాలా కోర్టులో ప్రవేశపెట్టారు. కార్తీని విచారించడానికి సీబీఐ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కార్తీని హడావిడిగా ఎందుకు అరెస్ట్ చేయవలిసి వచ్చిందని కార్తీ తరుపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. అయితే సీబీఐ న్యాయవాది మాత్రం ఇందుకు అంగీకరించలేదు. కార్తీ చిదంబరాన్ని ఐదురోజుల సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. . ఐఎన్ఎక్స్ కుంభకోణం కేసులో లంచాలు తీసుకున్నట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని, ఇంకా విచారించాల్సి ఉన్నందున తమకు కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది కోరారు. పటియాలా కోర్టు సీబీఐ కస్టడీకి అంగీకరించింది. దీంతో కార్తీని ఈ నెల 6వ తేదీ వరకూ సీబీఐ విచారించనుంది. కార్తీ అరెస్ట్ రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది.
కావాలనే అరెస్ట్ చేశారంటూ....
కార్తీని కావాలనే అరెస్ట్ చేశారని, చిదంబరాన్ని కూడా అరెస్ట్ చేయడానికి సీబీఐ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కార్తీపై గతంలోనే అనేక ఆరో్పణలు వచ్చాయి. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కార్తీని గతంలో అనేకసార్లు ప్రశ్నించి వదిలేశారు. కార్తీపై లుక్ అవుట్ నోటీసులు కూడా గతంలో జారీ అయ్యాయి. అయితే న్యాయస్థానం అనుమతితో కార్తీ లండన్ వెళ్లి వచ్చారు. కార్తీ చిదంబరం పదేపదే యూరప్ వెళుతున్నారని, అక్కడ ఆధారాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్నది సీబీఐ వాదన. 2007లో కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్ డీఐలను అనుమతించేందుకు లంచం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. మొత్తం మీద కార్తీ చిదంబరం అరెస్ట్ తో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
- Tags
- కార్తి చిదంబరం

