కాకమ్మ కబుర్లు వినిపిస్తున్న కర్నె!

కాకమ్మ కబుర్లు వినిపిస్తున్న కర్నె!
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం కట్టడానికి నిర్ణయించుకుంది. సచివాలయ భవనాల ప్రాంగణంలో ఉన్న సమస్త భవనాలను కూల్చేయాలని కూడా నిర్ణయించుకుంది. అన్నిటినీ కూల్చేసి ఒకే ఒక పెద్దభవనం కట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇది ప్రజలందరికీ కూడా అర్థమైంది.
అయితే కేసీఆర్ ఇంత హఠాత్తుగా కొత్త సచివాలయం నిర్మాణానికి ఎందుకు పూనుకున్నారనే దానిపై రకరకాల కథనాలు ఉన్నాయి. ఆయనకు సచివాలయ వాస్తు నచ్చలేదని, కేవలం వాస్తు కోసం కొత్తది కట్టిస్తున్నారని అనేవాళ్లు కొందరైతే.. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రం, పరిపాలన, చరిత్ర, ప్రత్యేకించి హైదరాబాదు నగరం మీద ‘కేసీఆర్ ముద్ర’ ఉండాలని కోరుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఐకానిక్ టవర్స్ గా సచివాలయ హర్మ్యాలను కూడా నిర్మించడానికి పూనుకుంటున్నట్లు కొందరు చెబుతుంటారు.
కేసీఆర్ మాత్రం స్వయంగా.. ఈ సచివాలయంలో కనీసం కేబినెట్ మీటింగ్ పెడదామన్నా సరైనా మీటింగ్ హాల్ లేదు. ఫారిన్ ప్రతినిధులు వస్తే కలవడానికి అందమైన చోటు లేదు.. ఇలాంటిది చాలా ఇరుకుగా ఉంటోంది. అందుకే కొత్తది అవసరం... అని తేల్చి పారేశారు. ప్రతిపక్షాలు మాత్రం రకరకాల కోణాల్లో విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. విషయం ఎలాంటిదైనా సరే.. ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్దంగా ఉండే ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఓ కొత్త వాదన తెరమీదికి తెచ్చారు. ప్రస్తుత సచివాలయంలో సరైన పార్కింగ్ సదుపాయం లేదని, వంద కార్లు కూడా ఆపడానికి లేదని అందువల్లనే కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకుంటున్నాం అని సెలవిస్తున్నారు.
అయినా.. చోద్యం కాకపోతే.. కేవలం పార్కింగ్ కోసం 350 కోట్లతో కొత్త సచివాలయం అంటే ఎవరైనా నవ్వుతారు. అయినా ఈ రోజుల్లో మల్టి లెవెల్ హైడ్రాలిక్ పార్కింగ్ సదుపాయాలను వాడుకుంటే.. అతి తక్కువ స్థలంలోనూ ఓ వంద కార్లు పార్క్ చేయవచ్చు. కనీసం కొత్త సచివాలయం కాంప్లెక్సులోనైనా.. సమస్తం సిమెంటు నిర్మణాలు కాకుండా.. ఇలాంటి ఆధునిక సాంకేతిక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తే.. స్థలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.

