కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?

తెలంగాణ శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడుగానే సమావేశాల్లో వ్యవహరిస్తుంది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ. ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా ఈ సభకు వచ్చి ప్రయోజనం లేదని వేదాంత ధోరణిలోకి వెళ్లారు. ప్రతిపక్షానికి సరైన గౌరవం దక్కక పోవడం, మర్యాద ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉంది. దీంతో సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సభకు వచ్చి ప్రయోజనం లేదన్నది ఆ పార్టీ నేతల వాదన. ఇటీవల స్పీకర్ ను కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో అవిశ్వాసాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
సర్కార్ పై అవిశ్వాసానికి.....
ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహిరిస్తుండటాన్ని తప్పు పడుతున్నారు. జానారెడ్డి కనీసం మైకు ఇవ్వమని అడిగినా ఇవ్వకపోవడాన్ని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జానారెడ్డి ఒకదశలో తనను అగౌరవపర్చే సభకు రాలేనని సీఎల్పీ సమావేశంలో చెప్పారు. అయితే మిగిలిన సభ్యులు ఆయనను అనునయించారు. దీంతో ఈ సమావేశాల్లోనే సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సభలో సభ్యుల సంఖ్యలో పదిశాతం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే సాంకేతికంగా చూస్తే కాంగ్రెస్ కు ప్రస్తుతం 19 మంది సభ్యులున్నారు. ఇక పార్టీలు మారిన వారిని తీసేస్తే దాని బలం 13 మంది మాత్రమే. అవిశ్వాసం పెట్టడానికి మరింత మంది సభ్యుల సంఖ్య అవసరం. దీంతో బీజేపీ, టీడీపీ, కమ్యునిస్టు పార్టీలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. అవిశ్వాసం పెట్టినా వీగిపోతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాని ఈ సందర్భంగా చర్చ జరిగే అవకాశముంది. తమ వాదనలను బలంగా విన్పించవచ్చు. దీంతో పాటు విప్ జారీ చేస్తారు కాబట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇరుకున పడతారు. ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ అవిశ్వాసానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
- Tags
- కాంగ్రెస్

