కాంగ్రెస్ లోకి వలసల వరద...?

కాంగ్రెస్ లోకి వలసల వరద వచ్చేటట్లుంది. రేవంత్ చేరికతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ మరికొంత మంది నేతలను టచ్ లో ఉంచుకున్నారు. వీరందరూ రాహుల్ సమక్షంలోనే చేరాలని నిర్ణయించడంతో రాహుల్ అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఉమా మాధవరెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డి, యేలేటి అన్నపూర్ణమ్మ తదితరులు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పేరున్న నేతలను ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధం కావాలని అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ నేతలు పెద్ద జాబితానే సిద్ధం చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా బీజేపీ, టీడీపీ నేతలున్నారని సమాచారం. వీరు ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ముహూర్తం చూసుకుని జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా?
మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా మైండ్ గేమ్ ప్రారంభించింది. కొండా సురేఖ దంపతులు పార్టీలోకి రానున్నారని, చర్చలు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటించడం సంచలనం కలిగించింది. కొండా దంపతులు వరంగల్ జిల్లాలో రెండు సీట్లు అడుగుతున్నారని, కాని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఒక్కటే ఇస్తామని చెప్పామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే దీనిని కొండా సురేఖ ఖండించారు. తాము టీఆర్ఎస్ ను వీడేది లేదని చెప్పారు. తమకు రాజకీయంగా జన్మనిచ్చింది వైఎస్సాఆర్ అయితే పునర్జన్మనిచ్చింది కేసీఆర్ అనిచెప్పారు. తాము పార్టీని వీడబోమంటున్నారు. కాని కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో టచ్ లో ఉన్నారని స్వయంగా పీసీసీ అధ్యక్షుడే చెప్పడం విశేషం. కొండా సురేఖ కూతురిని రాజకీయ అరంగేట్రంచేయించడానికి మరో నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పెద్దలను కోరారని, టీఆర్ఎస్ లో అయితే అదికుదరదని వారు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ చేరికతో ఇక కాంగ్రెస్ లో చేరికలే...చేరికలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
- Tags
- కాంగ్రెస్

