కాంగ్రెస్ లో కలవరం...ఎందుకంటే?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఇబ్బంది పెట్టాలని భావించి సోషల్ మీడియా వేదికను ఎంచుకుంది. మీడియా పరంగా ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రాకపోవడతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తేవాలని నిర్ణయించింది. ఈమేరకు గాంధీభవన్ లో ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకుంది. దీన్ని కొన్నాళ్ల క్రితం బలోపేతం చేసింది కూడా. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయాలనుకుంది హస్తం పార్టీ.
60 నియోజకవర్గాలకు అభ్యర్థులు....
అయితే అదే సోషల్ మీడియా ఇప్పుడు కాంగ్రెస్ కు ఇబ్బందిగా మారింది. ఇటీవల 60 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే అని ఒక జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఇబ్బందిగా మారింది. ఫోన్లలో ఆ నియోజకవర్గాల నేతలు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యనేతలు విసిగిపోయారు. కొందరైతే ఏకంగా గాంధీభవన్ కు చేరుకుని వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. దీంతో ఆ జాబితా ఎలా వచ్చిందోనని ఆరా తీసే పనిలో పడ్డారు టి.కాంగ్రెస్ నేతలు. తాము ఏ జాబితాను విడుదల చేయలేదని, అది ఎవరో ప్రయివేటువ్యక్తుల పని అని నచ్చచెప్పలేక నేతలకు తల ప్రాణం తోకకు వచ్చింది.
నేతలు పార్టీ మారుతున్నట్లు.....
ఇక కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రావణ్ పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. వాస్తవానికి శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఆయన అధికార పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ నేతలు కంగారు పడాల్సి వచ్చింది. దీనిపై దాసోజు శ్రావణ్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తమపై మైండ్ గేమ్ ఆడుతున్నారన్న విషయం అర్థమైన కాంగ్రెస్ తర్వాత దాన్ని మర్చిపోయింది. ఇక కాంగ్రెస్ లో గ్రూపుల గోల, నేతలు పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడాన్ని చూస్తే అధికారపార్టీనే అనుమానించాల్సి వస్తుందని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. మొత్తం మీద సోషల్ మీడియా వేదికగా హస్తం పార్టీ అనేక అగచాట్లు పడుతోంది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.
- Tags
- కాంగ్రెస్

