కాంగ్రెస్ కు వచ్చేది పది సీట్లేనా?

తెలంగాణ కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర పేరిట ఉత్సాహంగా ఉంటే దానిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నీళ్లు కుమ్మరించారు. తాను ఇటీవల రెండు సర్వేలు చేయించానని చెప్పారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఆరున్నర లక్షల నమూనాల సేకరించి పకడ్బందీగా సర్వేలను నిర్వహించామని చెప్పారు. ఈ సర్వేల్లో ఒకదానిలో తమ పార్టీకి 106 సీట్లు, మరొక సర్వేలో 103 సీట్లు వస్తాయని తేలిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కోసమో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసమో ఈ సర్వే చేయించలేదని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకే సర్వేలు చేయించామని చెప్పారు.
బీజేపీకి ఒక్క సీటు కూడా....
తాము జరిపించిన రెండు సర్వేల్లో కాంగ్రెస్ కు పది సీట్లకు మించి రావని తేలిందని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర పేరిట ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా పది అంకెకు మించి సీట్లు రాబోవన్నారు. ఇందుకోసం వారు గడ్డం తీయనన్న ప్రతిజ్ఞలు చేయడం మానుకోవాలని ఆయన ఉత్తమ్ ను పరోక్షంగా ఎద్దేవా చేశారు. మరోసారి విజయం తమదేనని, తెలంగాణ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయి పోయారని చెప్పారు. ఇక బీజేపీకి తెలంగాణలో ఇప్పుడు వచ్చిన సీట్లను నిలబెట్టుకుంటే చాలన్నారు. తన సర్వేలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలిందన్నారు.
బస్సు యాత్రకు పంక్చర్ వేయడానికేనా?
ీఅయితే బస్సుయాత్ర పేరిట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇటీవల దూకుడు పెంచారు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ పర్యటిస్తున్నారు. సీనియర్ నేతలందరూ ఒకే వేదికపై చేరి కేసీఆర్ పై ధ్వజమెత్తుతున్నారు. ఈ బస్సుయాత్రకు కొంత పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రజలు కూడా సభలకు బాగానే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను మానసికంగా దెబ్బతీయడానికే ఈ సర్వే ఫలితాలను కేసీఆర్ బయటపెట్టారన్నది టాక్. మైండ్ గేమ్ లో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ కు పది సీట్లకు మించి రావని తేల్చి పారేశారంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
- Tags
- కాంగ్రెస్

