కాంగ్రెస్ ఆశలు చిగురిస్తున్నాయా?

గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి ఆశలు చిగురించాయి. నిన్న మొన్నటి దాకా పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ పెట్టిన కిరికిరి ఇప్పుడు తొలగిపోయింది. ఆయనకు కావాల్సిన సీట్లతో పాటు పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. పటేళ్ల రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ నియమించిన కమిటీ చేసిన సిఫార్సులకు హార్థిక్ పటేల్ ఒకే చెప్పారు. దీంతో గుజరాత్ ఎన్నికల్లో పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మేరకు హార్థిక పటేల్ ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు. సెక్షన్ 31, సెక్షన్ 46 కింద పటీదార్లనున బీసీల్లో చేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లపై బిల్లును తీసుకొస్తుందని హార్థిక్ పటేల్ చెప్పారు. తమ రిజర్వేషన్ల విషయం మ్యానిఫేస్టోలో చేర్చేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని తెలిపారు.
మరో సమస్య ముందుంది....
మరోవైపు పటేళ్లకు 20 సీట్లు కావాలని హార్థిక్ పటేల్ పట్టుబడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద సంఖ్యలో సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే గుజరాత్ కాంగ్రెస్ లో అసమ్మతులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హార్థిక్ పటేల్ ను సీట్ల విషయంలో సముదాయించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నేరుగా రాహుల్ గాంధీతోనే హార్థిక్ పటేల్ చేత మాట్లాడించాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఎక్కువ సంఖ్యలో పటీదార్లకు సీట్లను కేటాయించింది. దాదాపు 18 మందికి పటేల్ సామాజిక వర్గానికి బీజేపీ సీట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో సీట్ల విషయంలో హార్థిక్ గట్టిగానే పట్టుబట్టే అవకాశముంది. సీట్ల విషయం తేలితేనే హార్థిక్ పటేల్ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించే అవకాశముందంటున్నారు. ఇప్పటి వరకూ ఏ బహిరంగ సభలోనూ హార్థిక్ పటేల్ కాంగ్రెస్ కు ఓటెయ్యమని చెప్పక పోవడం విశేషం.

